తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల జీతాలు అందలేదు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం, ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందా...? లేదా...? అనే అనుమానాలతో కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో మరణిస్తున్నారు. 
 
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం మండిపల్ గ్రామానికి చెందిన వీరభద్రయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించటం లేదనే ఆవేదనతో గుండెపోటుతో మృతి చెందాడు. 42 సంవత్సరాల వయస్సు గల వీరభద్రయ్యకు గుండెపోటు రావడంతో చికిత్స కొరకు ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్టీసీ డ్రైవర్ వీరభద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు. 
 
ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వటంతో పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ వీరభద్రయ్య విధులకు వెళ్లలేకపోయాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఆందోళను గురైన వీరభద్రయ్య కొన్ని రోజుల నుండి తినడం మానేయడంతో అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం పాలైన వీరభద్రయ్యకు గుండెపోటు రావటంతో వికారాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. 
 
ఈరోజు ఉదయం వీరభద్రయ్య మృతి చెందాడు. ఆర్టీసీ కార్మికులు వీరభద్రయ్య మృతదేహంతో పరిగి డిపో ముందు ఆందోళనకు దిగారు. ఆందోళన జరిగిన సమయంలో మరో ఆర్టీసీ కండక్టర్ కు ఫిట్స్ వచ్చాయి. తోటి ఆర్టీసీ కార్మికులు అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఫిట్స్ వచ్చిన కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్టీసీ కార్మికుడిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మె దిశగా పయనిస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తామని ప్రకటించినా స్పందించకపోవటంతో సమ్మెను యథావిథిగా కొనసాగిస్తామని చెబుతున్నారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రేపు సేవ్ ఆర్టీసీ పేరుతో ర్యాలీలు నిర్వహిస్తామని సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: