ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని  జగన్ సర్కార్ పై టీడీపీ కత్తులు దూస్తున్న సంగతి తెలిసిందే. వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఇటు సోషల్ మీడియాలోను అటు ఎలక్ట్రానిక్ మీడియాలోను తెలుగుదేశం నాయకులు చాలా యాక్టివ్‌రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మత  మార్పిడులను ప్రోత్సహిస్తున్నారంటూ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది టీడీపీ. ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతుండటం కూడా ఇందులో భాగమే అంటూ కొందరు టీడీపీ నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానించడం విశేషం. ఇక దీనికి మరింత ఆజ్యం పోసేందుకు హిందూత్వ అజెండాతో టీడీపీ బీజేపీ పంచన చేరుతోందని ఓ జాతీయ పత్రిక కథనం రాసుకొచ్చింది. 

 

   బీజేపీకి గుడ్ బై చెప్పిన ఏడాదిన్నరకు మళ్లీ టీడీపీ దగ్గరవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని  వినిపిస్తోంది. జగన్‌ టార్గెట్‌గా హిందూత్వ అజెండాతో బీజేపీకి దగ్గరవ్వాలనే ప్రయత్నం టీడీపీ చేస్తోందని, ఇప్పటి వరకు సెక్యులర్ పార్టీగా ముద్రవేసుకున్న టీడీపీ మెల్లగా స్వరం మారుస్తూ హిందూత్వ అజెండాను తీసుకుంటోందని తెలుసుతోంది. స్వతహాగా క్రైస్తవుడైన ఏపీ సీఎం వైయస్ జగన్‌ హిందువులకు వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు టీడీపీ యోచిస్తోందంటూ, ఆ విషయంలో బీజేపీ కంటే టీడీపీనే ఎక్కువ ప్రచారం చేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లో హిందూ అజెండాను బీజేపీకంటే టీడీపీనే ఎక్కువగా ప్రస్తావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

   బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా టీడీపీ హిందూత్వ రాజకీయాలు చేయలేదని చెబుతున్న అనలిస్టులు.. ఈ సారి మాత్రం అదే అజెండాగా బీజేపీతో దగ్గరయ్యేందుకు సైకిల్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా జగన్‌ను ఈజీగా టార్గెట్ చేయొచ్చనే భావనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. ఇందుకోసం పలు అంశాలను అస్త్రాలుగా మలుచుకుంది టీడీపీ.

 

   తిరుపతి లడ్డూ ధరలను పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదన దగ్గర నుంచి ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లుగా జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వలేదనే అంశాలను ప్రస్తావిస్తోంది టీడీపీ. అదే సమయంలో గుంటూరులో ఓ ఆలయం కూల్చివేత దగ్గర నుంచి తాజాగా ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతున్నట్లు జగన్ సర్కార్ చేసిన ప్రకటన లాంటి అంశాలను అస్త్రాలుగా మలుచుకుని రాష్ట్రంలో క్రైస్తవ మతాన్ని జగన్ ప్రభుత్వం వ్యాపింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ప్రచారం  చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: