ఇసుకను అక్రమంగా తరలించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇసుకాసురులపై చట్టపరమైన చర్యలు ఆరంభం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే దీనికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కడపలో నమోదైన ఇసుక అక్రమ రవాణా కేసులో జిల్లా న్యాయస్థానం నిందితులకు మూడేళ్ల కారాగార శిక్షను విధించింది. దీనితో పాటు 10 వేల రూపాయల భారీ జరిమానాను చెల్లించాలని ఆదేశించింది. 'బ్లూ ఫ్రాగ్’లో సీఐడీ సోదాలు తొలి కేసు వైఎస్ జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇసుక పాలసీని అమలులోకి తీసుకొచ్చిన తరువాత నమోదైన తొలి కేసు ఇదే. 

 

     పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం, న్యాయస్థానం మెట్లు ఎక్కడం, చట్టపరంగా శిక్షను విధించడం.. ఇలా న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేసుకున్న తొలి కేసుగా నిలిచింది. ఇసుకను అక్రమంగా తరలించిన కేసులో నంద్యాల సుబ్బరాయుడు అనే 20 సంవత్సరాల యువకుడికి జైలు శిక్ష విధిస్తూ కడప జిల్లా ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం రెండవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి జస్టిస్ పీ భానుసాయి తీర్పు ఇచ్చారు. 

 

    కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం గోపరాజు పల్లికి చెందిన నంద్యాల సుబ్బరాయుడు పాపాఘ్ని నది నుంచి ట్రాక్టర్ (ఏపీ 04 బీవీ 4460/ఏపీ39 ఏడబ్ల్యూ 1334)లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ జులై 15వ తేదీన పోలీసుల చేతికి చిక్కాడు. అతనిపై పెండ్లిమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పెండ్లిమర్రి ఎస్ఐ అతనిపై నమోదు చేసిన ఛార్జిషీటు (సీఆర్ నంబర్ 152/2019)ను నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన సుబ్బరాయుడిని కడప న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. 

 

   ఈ నెల 15వ తేదీన పెండ్లిమర్రి పోలీసులు సుబ్బరాయుడిని కడప న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి జస్టిస్ భానుసాయి వాదోపవాదాలను ఆలకించారు. ఈ కేసులో సుమార 12 మందిని ఆమె విచారించారు. ప్రభుత్వం రూపొందించిన ఇసుక పాలసీ గురించి వివరించారు. ఇసుకను అక్రమంగా తరలించడాన్ని ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణిస్తోందనే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈశ్వర్ రెడ్డి న్యాయమూర్తికి వివరించారు. దీనిపై వాదోపవాదాలను ఆలకించిన తరువాత.. న్యాయమూర్తి నిందితునికి శిక్షను ఖరారు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: