భార‌త పౌర‌స‌త్వం విష‌యంలో...ట్విస్టుల మీద ట్విస్టులు ఎదుర్కుంటున్న వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఊర‌ట ద‌క్కింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన‌ చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాదని కొందరు బీజేపీ నేతలు గతంలో కోర్టును ఆశ్రయించారు. పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఇదే అభిప్రాయం తెలిపింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అన్ని వివరాలు పరిశీలించి, ఆయన భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని ప్రకటించింది. అయితే...ఆయ‌న‌కు తాజాగా కోర్టులో ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. 4 వారాల గ‌డువుతో కోర్టు స్టే ఇచ్చింది.

 


భారత పౌరసత్వానికి చెన్నమనేని అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై తాజాగా కోర్టు విచారణ చేపట్టింది. తన పౌరసత్వాన్ని రద్దుచేస్తూ కేంద్ర హోంశాఖ జారీచేసిన ఉత్తర్వులు నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని ర‌మేశ్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ జారీచేసిన ఉత్తర్వులు ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని, సిటిజన్‌షిప్ యాక్ట్-1955 సెక్షన్ 10 (3) నిబంధనలను కేంద్ర హోంశాఖ ఉల్లంఘించిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లకపోతే పౌరసత్వాన్ని తిరస్కరించరాదని పేర్కొంటున్న సెక్షన్ 10 (3) కోణంలో కేంద్రం చర్యలు తీసుకోలేదని, విచక్షణను ప్రదర్శించలేదని రమేశ్‌బాబు పేర్కొన్నారు. తాను పుట్టుకతోనే తాను భారతీయుడినని తెలిపారు.

 

పౌరసత్వ రద్దు ఉత్తర్వులపై నాలుగు వారాల పాటు హైకోర్టు స్టే విధించింది. విచారణను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలాఉండ‌గా, రమేశ్ పిటిషన్‌పై తమకు తెలియకుండా ఎటువంటి ప్రక్రియ చేపట్టరాదంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయ‌డం గ‌మ‌నార్హం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: