ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో మద్యపాన నిషేధం ఒకటి. దీనిపై స్పస్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పటికే కొత్త నియమనిబంధనలతో ముందుకెళ్తోంది. బెల్లు షాపులు రద్దు చేసి మద్యం దుకాణాలపై నియంత్రణలోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని బార్ల యజమానులకు షాకిచ్చింది.

 

 

మద్య నిషేధం అమలులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. ఇందుకు ప్రతిగా లాటరీ పద్ధతిలో ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వనుంది. బార్ల సంఖ్యతో పాటు బార్లు పనిచేసే సమయాలను కూడా కుదించింది. ఇప్పటికే బార్ల సమయాలను రాత్రి 10గంటలకు కుదించింది. నూతన బార్ల పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీలోని బార్లను నలభై శాతం తగ్గించినట్టైంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి కొత్త పాలసీనీ ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితికి లైసెన్సులు ఇచ్చే విధంగా ఈ కొత్త పాలసీని తీసుకురానున్నట్టు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ కొత్త పాలసీ అమలులోకి రానుంది. ఇప్పటి వరకూ ఉన్న పాత పాలసీ ఈ ఏడాది డిసెంబర్ 31 అర్ధరాత్రితో పూర్తికానుంది. కొత్త అప్లికేషన్ కోసం లైసెన్సు ఫీజు కింద 10లక్షల రూపాయలగా నిర్ణయించింది. లాటరీ ద్వారా బార్లను కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకుంది.

 

 

రిటైల్ షాపుల మాదిరిగానే బార్లు తెరిచి ఉంచే సమయాన్ని కూడా ఉదయం 11గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ కుదించింది. ఇప్పటి వరకూ 700పైగా బార్లు ఉంటే ఇకపై 500 బార్ల వరకూ మాత్రమే లైసెన్సులు ఇచ్చేవిధంగా నిర్ణయం తీసుకుంది. ఇకపై బార్లలో విక్రయించే మద్యం ధరలను కూడా టాక్సుల రూపంలో పెంచనుంది. దీనికనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: