ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు యూట‌ర్న్‌ల‌లో రికార్డులు సృష్టించార‌ని రాష్ట్ర సమాచార,ప్రసార,రవాణా శాఖలమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుది యూటర్న్‌ జీవితమ‌ని సెటైర్ వేశారు. ఇంగ్లీషుపై చంద్రబాబు యథాప్రకారం యుటర్న్‌ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ``ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ  ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ ఇస్తున్నామని చెబితే దానికి హర్షం ప్రకటించిన వ్యక్తి చంద్రబాబు. అర్దరాత్రి సమయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఆ ప్యాకేజీ బాగుందని ప్రకటించారు. ఆ ప్యాకేజీపై పుస్తకాలు ముద్రించి ప్యాకేజీ బాగా ఉందని చంద్రబాబు డ‌బ్బా కొట్టారు. మోడీ నిర్ణయం బాగుందని ప్రచారం చేశారు. కానీ తొంద‌ర‌లోనే యూట‌ర్న్ తీసుకున్నారు. ``అని గుర్తు చేశారు.

 

2019 ఎన్నికలకు ముందు ప్రజల డబ్బుతో రాష్ట్రంలోను,ఢిల్లీలోను చంద్ర‌బాబు ధర్మపోరాటదీక్షలు చేశారని మంత్రి నాని గుర్తు చేశారు. ``పశ్చిమబెంగాల్,కర్నాటక,తమిళనాడు వెళ్లి మమతా బెనర్జీ, దేవెగౌడ, స్టాలిన్, రాహుల్‌ గాంధీల ఇళ్లకు వెళ్లి ఎన్నికల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నరేంద్రమోదీ, అమిత్‌ షాలను ఇష్టవచ్చినట్లు తిట్టారు. ఎన్నికలకు ముందు కొందరితో కలసి పోటి చేసిన చంద్రబాబు ఎన్నికలయ్యాక అప్పటి స్నేహితులందర్ని వదిలేశారు. అటు కాంగ్రెస్‌, దేవేగౌడ కానీ, మమతాబెనర్జీ,స్టాలిన్‌ ఇలా వారు ఊసే ఎత్తడంలేదు. వారి చేతులు కాళ్లు పట్టుకుని మనందరం మోదీకి వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. తిరిగి ఎన్నికలయ్యాక నరేంద్రమోదీని వ‌దిలివేసి తప్పు చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది మరో యూటర్న్‌`` అని వ్యాఖ్యానించారు. 

 

``గతంలో అమిత్‌షా ను ఇష్టవచ్చినట్లు తిట్టి ఆయన పుట్టిన రోజుకు లోకేష్‌ ,చంద్రబాబులు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీలు పడ్డారు. మీ నాయకత్వంలో దేశం(టీడీపీ) బాగుండాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. జుగుప్సాకరమైనది చంద్రబాబు రాజకీయజీవితం. ఎన్నికలకు ముందు, 2014లో పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి నాకు పనిచేయమని అడుగుతారు. ఆ తర్వాత ఎవరికి వారు వేరు అని చెబుతారు. తిరిగి ఎన్నికలకు దగ్గరకు వచ్చిన తర్వాత జనసేన టిక్కెట్లు కూడా టీడీపీ వారే ఇస్తారు. వారి తరపున వీరే ప్రచారానికి మానుకుంటారు. భీమవరం,గాజువాకలో పవన్‌ కోసం నేను అక్కడకు రాలేదని పబ్లిక్‌గా చెబుతారు. ఇప్పుడు ఇద్దరు కలసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. టీడీపీ నేతలకు కార్యకర్తలకు అయోమయంగా ఉంది.` అని ఎద్దేవా చేశారు. 
కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రీపై సైతం మంత్రి నాని మండిప‌డ్డారు. ``సుజనా చౌదరి అని ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన బాబుగారి భజన పార్టీ. పేరుకు బీజేపీ అంటారు. ఇలాంటి ఇంటి దొంగల్ని బీజేపీ వారు ఎప్పుడు పట్టుకుంటారో వారికే తెలియాలి. బీజేపీ గతంలో సిద్ధాంతాల‌తో ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.`` అని అన్నారు.

 

సుజనాచౌదరి కాల్‌ డేటా చూస్తే ఆయ‌న ఎవ‌రికోసం ప‌ని చేస్తున్నారో అర్థ‌మవుతుంద‌ని మంత్రి వ్యాఖ్యానించారు. ``మీరు పార్టీ మారిన దగ్గర్నుంచి కాల్‌ డేటా లిస్ట్‌ చూపండి. రోజూ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. మీరు ఎవరితో తెరచాటు రాజకీయాలు చేస్తున్నారు. ఒప్పందాలు ఏంటి అనేది తెలిసిపోతుంది. మీరు గడిచిన జీవితం ఎలా ఉన్నా మచ్చలమయంగా ఉన్నా....బ్యాంకులకు కన్నాలు వేసి ఉండ‌వ‌చ్చు. మంత్రి అయిన త‌ర్వాతైన‌ మారాలి. బాధ్యతాయుత మంత్రిగా చేసిన తర్వాత అయినా మీ తత్వం,మీ నడవడిక,ఆలోచనలో మార్పు రావాలి. కానీ మీరు అంతకంతకు దిగజారేలా ప్రవర్తిస్తున్నారు.తీరు మార్చుకోండి.మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాం.సుజ‌నా చౌద‌రి గారు`` అని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: