ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయి. వీటన్నింటికీ సర్కారు సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో స్పీకర్  పైన అనుచితంగా వ్యవహరించారనే అభియోగంతో టీడీపీ నేతల పైన వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. 

 

డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ స్పీకర్ ఆదేశాల మేరకు కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలి రోజు సమావేశం మగిసిన తరువాత బీఏసీ మీటింగ్ ఉంటుంది. సభ జరగాల్సిన పని దినాలు.. సమయం.. చర్చించాల్సిన అంశాలు.. ప్రభుత్వం నుండి లేవెనెత్తే చర్చలు.. తీర్మానాలు.. వంటివి బీఏసీలో ఖరారవుతాయి. ఏ అంశం మీద ఏ పార్టీకి ఎంత సమయం కేటాయించే అంశం మీదా అదే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. పోలవరం, రాజధాని, ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లు, ఇసుక కొరత, మద్యపాన నిషేధం వంటి అంశాలపై ఇప్పటికే రాజకీయం రంజుగా సాగుతున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాలకు ఈ వేడి తాకే సూచనలు కనిపిస్తున్నాయి. 

 

మరోవైపు అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది.  స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవిలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. సరైన సమయంలో ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేసుకునేందుకు.. టీడీపీని ఆత్మరక్షణలో పడేసేందుకు ఈ అస్త్రాన్ని అధికార పార్టీ తెర మీదకు తెచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో పాటు రోజాను టీడీపీ హయాంలో ఏ విధంగా ఇబ్బందులు పెట్టారనే అంశాన్ని ప్రస్తావించి.. ఇరుకునపెట్టాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. 

 

వల్లభనేని వంశీ ఎపిసోడ్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్కుగా మారింది. వంశీ పార్టీ మారుతున్నట్టు ప్రకటించిన విషయం సభలో ప్రస్తావనకు రాకున్నా.. వంశీ సభలో ఎక్కడ కూర్చుంటారు..? ప్రత్యేకంగా తనకు సీటు కేటాయించమని వంశీ ఏమన్నా కోరతారా..? వంశీపై టీడీపీ అనర్హత పిటిషన్‌ ఇస్తుందా..? లేదా..? అనేది చూడాల్సి ఉంది. టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు ఇప్పటికే వైసీపీ వ్యూహం సిద్దం చేసిందనే ప్రచారంతో.. అసెంబ్లీ సమావేశాల టైంలోనే ఏమైనా జంపింగ్‌లు ఉంటాయా..? అనే ఉత్కంఠ నెలకొంది. అలాగే బీజేపీ కూడా టీడీపీ ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా ఇప్పటికే బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: