ఢిల్లీ వేదిక‌గా...ఆర్టీసీ స‌మ్మెపై క‌ద‌లిక వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఓ వైపు బీజేపీ ఎంపీలు, కేంద్ర‌ మంత్రులు ఈ విష‌యంలో స్పందిస్తున్న స‌మ‌యంలోనే...తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఢిల్లీ టూర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఢిల్లీలో గవర్నర్ల సదస్సుకు తమిళిసై హాజ‌రైన‌ప్ప‌టికీ...ఆమె ద్వారా కేంద్రం ఆర్టీసీ స‌మ్మెపై రిపోర్ట్ కోరే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన  ఢిల్లీలో జరిగే అన్నిరాష్ర్టాల గవర్నర్ల సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ గురువారం రాత్రి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న ఆమెకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ స్వాగతం పలికారు. మూడు రోజులపాటు గవర్నర్ తమిళిపై ఢిల్లీలోనే ఉండనున్నారు. అయితే, తొలిరోజు స‌మావేశంలో పాల్గొన‌నున్న గ‌వ‌ర్న‌ర్ మ‌రో రెండు రోజులు అక్క‌డే ఉండ‌టంపై ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే బీజేపీ ఎంపీలు ఫిర్యాదుల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్న నేప‌థ్యంలో...గ‌వ‌ర్న‌ర్ ద్వారా కేంద్రం ఆర్టీసీ స‌మ్మెపై నివేదిక తీసుకుంటుందా? అని చ‌ర్చ సాగుతోంది. 

 

ఇదిలాఉండ‌గా, ఆర్టీసీ సమ్మె విషయంపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్విండ్, బండి సంజయ్, బాబూరావులు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌కు లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి  ఆ లేఖను కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కు సమర్పించారు.“ ఆగస్ట్ 2019 గానూ 80 కోట్ల బకాయిలు చెల్లించమని EPO నుంచి డిమాండ్ నోటీస్ వచ్చింది. మొత్తం పీఎఫ్ కు సంబంధించి 760 కోట్ల బకాయిలు ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇప్పటికే 49 వేల మంది ఉద్యోగులు సమ్మె చేసినా  రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం స్పందించలేదు. పీఎఫ్ బకాయిలు చెల్లించక పోవడం EPF యాక్ట్ ప్రకారం క్రిమినల్ చర్య. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా మీరు వెంటనే జోక్యం చేసుకోవాలి.” అని  ఎంపీలు తమ లేఖలో తెలిపారు.

మ‌రోవైపు, గురువారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని క‌లిసి తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెను ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, అర్వింద్ ధర్మపురి వివ‌రించారు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ...ఫ‌లితం దొర‌క‌లేదు. దీంతో, గ‌వ‌ర్న‌ర్ ద్వారా రిపోర్ట్ తీసుకుంటార‌ని స‌మాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: