ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ దూకుడు పెంచుతోంది. ప్ర‌ధానంగా బీజేపీ  తెలంగాణ బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్, బాబూరావు టీఆర్ఎస్ వ్య‌తిరేకంగా నిలిచిన ఈ అంశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా..వ‌రుస మీటింగ్‌ల‌తో గులాబీ ద‌ళ‌ప‌తి స‌ర్కారును టార్గెట్ చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర రవాణా మంత్రి క‌లిసి వివిధ అంశాల‌పై ఫిర్యాదు చేసిన మ‌రుస‌టిరోజే...కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌కు లేఖ రాశారు, వ్య‌క్తిగ‌తంగా క‌లిశారు. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

 

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎంపీలు ధర్మపురి అర్వింద్,  బండి సంజయ్, సోయం బాపూరావు కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, సంస్థ భూముల లీజుల వ్యవహారం, ప్రైవేటు బస్సుల పర్మిట్​ వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ సమ్మెతో పాటు కార్మికుల ఆత్మహత్యలు, మరణాలను కూడా గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో,  తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చెప్పారు. రాష్ట్ర అధికారులను పిలిచి మాట్లాడుతానని, సీఎం కేసీఆర్‌తోనూ చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

 

ఇక ఆ మ‌రుస‌టి రోజే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సార‌థ్యంలోని ఎంపీలు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను క‌లిశారు. ఆయ‌న‌కు ఓ లేఖ సమర్పించారు. “ ఆర్టీసీకి చెందిన‌ ఆగస్ట్ 2019 యొక్క 80 కోట్ల బకాయిలు చెల్లించమని EPO నుంచి డిమాండ్ నోటీస్ వచ్చింది. మొత్తం పీఎఫ్ కు సంబంధించి 760 కోట్ల బకాయిలు ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇప్పటికే 49 వేల మంది ఉద్యోగులు సమ్మె చేసినా  రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం స్పందించలేదు. పీఎఫ్ బకాయిలు చెల్లించక పోవడం EPF యాక్ట్ ప్రకారం క్రిమినల్ చర్య. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా మీరు వెంటనే జోక్యం చేసుకోవాలి” అని  ఎంపీలు తమ లేఖలో తెలిపారు. ఇలా అన్ని అంశాల్లోనూ..కేసీఆర్ స‌ర్కారును టార్గెట్ చేసేలా బీజేపీ ఎంపీలు అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: