మొన్నటివరకు టీడీపీలో యువనాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్న దేవినేని అవినాష్ వైసీపీలో చేరడంతో ఒక్కసారిగా విజయవాడ తూర్పు రాజకీయాలు మారిపోయాయి. చేరడం చేరడమే తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టేందుకు జగన్...అవినాష్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేశారు. దీంతో దేవినేని వర్గం ఆనందానికి అవధుల్లేవు. తమకు టీడీపీలో ఏదైతే దక్కలేదని బాధపడ్డారో ఇప్పుడు అదే వైసీపీలో దక్కడంతో దేవినేని అనుచర వర్గం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

 

అయితే అవినాష్ కు పదవి ఇవ్వడం వరకు బాగానే ఉంది కానీ....ఈ నియోజకవర్గంపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్న బొప్పన రవికుమార్, యలమంచి రవిల భవిష్యత్తు ఏంటనేది అర్ధం కాకుండా ఉంది. మొన్న ఎన్నికల్లో గద్దె మీద ఓడిపోయిన బొప్పన  రవికుమార్....ఇప్పటివరకు ఇన్-చార్జ్ గా భాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అవినాష్ రావడంతో ఆయనకు విజయవాడ నగర అధ్యక్షుడుగా నియమించారు.

 

అలాగే భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదిరితే మేయర్ కూడా ఇస్తామని అంటున్నారు. కాకపోతే బొప్పన వర్గం మాత్రం అవేం వద్దు ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికల్లో టికెట్ దక్కక, ఇప్పుడు ఇన్-చార్జ్ దక్కకుండా పోవడంతో మాజీ ఎమ్మెల్యే యలమంచి రవి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అయితే ఆయనకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్‌ ఇస్తామని వైసీపీ అధిష్టానం చెబుతోంది. కానీ రవి వర్గం కూడా ఎమ్మెల్సీనే ఇవ్వాలని అంటున్నారు.

 

అటు వల్లభనేని వంశీ టీడీపీలోకి వచ్చిన నేపథ్యంలో గన్నవరం ఇన్-చార్జ్ గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి ఒకే సామాజికవర్గానికి చెందిన వీరికి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం సాధ్యపడకపోవచ్చు. అయితే జగన్ మాత్రం వీరికి అన్యాయం జరగకుండా కీలక పదవులు ఇచ్చేందుకు చూస్తున్నారు. బొప్పనకు మేయర్, రవికు దుర్గ గుడి ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: