ఒకే ఒక్క ఘోర ఓటమి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తునే ఆగమ్యగోచరంగా మార్చేసింది.  ఓటమిదెబ్బకు టీడీపీకి భవిష్యత్తు ఉండదని నేతలు ఒక్కొక్కరిగా చేజారిపోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నేతల వలసల కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లింది మొదలు....తాజాగా దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలు వైసీపీలోకి వెళ్ళేవరకు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతూ వస్తోంది.

 

అయితే ఈ వలసలు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. ఇంకా మరికొందరు కూడా టీడీపీని వీడనున్నారు. అందులో ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరబోతున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని కరణం కూడా పెద్దగా ఖండించిన సందర్భాలు కూడా లేవు. ఒంగోలు వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉండే కరణం ఇటీవల వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మనవడి పుట్టినరోజు వేడుకకు  కూడా వెళ్లారు.

 

ఇక ఇక్కడే కరణంని వైసీపీలోకి తీసుకోచ్చేందుకు మంత్రి బాలినేని, ఎంపీ మాగుంటలు ప్రయత్నాలు చేశారని, వైసీపీ అధిష్టానం తరుపున మంచి ఆఫర్లు కూడా ఇచ్చారని తెలుస్తోంది. కమ్మ సామాజికవర్గంలో పట్టున్న కరణంని పార్టీలోకి తీసుకోచ్చేందుకు ఆయన తనయుడు కరణం వెంకటేష్ కు ఒంగోలు కార్పొరేష‌న్ మేయ‌ర్‌ పదవి ఇస్తానని చెప్పినట్లు సమాచారం. అలాగే వచ్చే ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

ఇక టీడీపీలో క‌ర‌ణం ఇమ‌డ లేక‌పోతున్నారు. ఆయ‌న‌కు చివ‌ర్లో చీరాల సీటు రాబ‌ట్టి మౌనంగా ఉన్నారే కాని లేక‌పోతే ఆయ‌న అద్దంకి సీటు నానా ర‌చ్చ చేసి ర‌విని గ్యారెంటీగా ఓడించే వారే. ఇక ఇప్పుడు పార్టీకి ఫ్యూచ‌ర్ లేక‌పోవ‌డంతో కరణం కూడా కుమారుడు భవిష్యత్తు కోసం వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాకపోతే తనకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి టీడీపీలో జరిగే పరిణామాలు బట్టి ఆయన పార్టీ జంప్ అయిపోతారని ప్రచారం జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: