రోజుకో మలుపు తిరుగుతూ వచ్చిన `మహా` రాజ‌కీయ‌ ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్ర సర్కారు ఏర్పాటు అంశం ఓ కొలిక్కి వచ్చింది. దాదాపు నెల రోజుల ఉత్కంఠ తర్వాత శుక్రవారం రాత్రి కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీలు మూడు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. ఎట్టకేలకు కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా పదవి చేపట్టబోతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు పదవుల పంపకంపై కూడా అవగాహనకు వచ్చాయి. శివసేనకు 16, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు షేర్ చేసుకునేలా ఓ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

ముంబైలోని నెహ్రూ సెంటర్లో శివసేన నేతలు ఉద్ధవ్ థాకరే, అదిత్య థాకరేలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీనియర్ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ చౌహాన్ లు సమావేశమయ్యారు.  ముంబైలో 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలన్న ప్రతిపాదనపై తాము ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు. అన్ని కీలకమైన విషయాలపై చర్చ జరిగిందని, శనివారం కూడా చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను ఎప్పుడు కలుస్తామన్నది కూడా శనివారం స‌మావేశం తర్వాత చెబుతామన్నారు. మూడు పార్టీల నేతలంతా కలిసి రేపు మీడియాతో మాట్లాడుతారని శివసేన నేతలు చెప్పారు. గవర్నర్‌ను కలిసే అంశంపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. 

 

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ కూటమి సిద్ధంగా ఉన్నదంటూ గవర్నర్‌ కోశ్యారీకి శనివారం లేఖ అందిస్తామని శివసేన నేత సంజయ్‌రౌత్‌ తెలిపారు. దీనిపై మూడు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలు ఉంటాయన్నారు. సోనియాగాంధీ, ఉద్ధవ్‌ఠాక్రే భేటీ అవుతారని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. మరోవైపు ఆదివారం లేదా సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని శివసేన, ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. సంకీర్ణ ప్రభుత్వానికి ‘మహారాష్ట్ర వికాస కూటమి’ అనే పేరును నిర్ణయించారని వెల్లడించాయి. సీఎంపీలో ‘లౌకిక, మతవాద’ వంటి పదాలు ఉండకపోవ చ్చని పేర్కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: