ఎట్ట‌కేల‌కు ఆంధ్రుల‌కు ద‌క్కిన అవ‌మానానికి ప‌రిష్కారం దొరికింది. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం కొత్తమ్యాప్‌ విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్రం హోంశాఖ ఆదేశాలతో సర్వే ఆఫ్‌ ఇండియా ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతి పేర్కొన‌క‌పోవ‌డంతో...దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా కేంద్రం కొత్త మ్యాప్ విడుద‌ల చేయ‌గా...ఈ ఘ‌న‌త‌ను అన్ని పార్టీలు త‌మ ఖాతాలో చేర్చుకుంటున్నాయి. 

 

జమ్ముకాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత కేంద్రం మ్యాప్ లో ఆ రెండింటినీ చేరుస్తూ భౌగోళిక మ్యాప్ లు విడుదల చేసింది. అయితే,  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్ లోనూ ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించ లేదు. 2015లో ప్రధాని శంకుస్థాపన చేసిన ఏపీ రాజధాని అమరావతిని ఎందుకు కేంద్రం గుర్తించలేదనే సందేహాలు వ్య‌క్త‌మ‌వ‌గా....స్థానిక ప్రభుత్వం తమ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ జారీ చేయలేదు. దీంతో.. కేంద్రం సైతం గుర్తించలేదు. దీంతో,  అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించాలంటూ వివిధ వ‌ర్గాలు కోరాయి. మ‌రోవైపు పార్ల‌మెంటులోనూ భారత మ్యాప్ లో ఎపి రాజదాని అమరావతిని చేర్చాల‌ని చ‌ర్చ జ‌రిగింది. 

 

దీంతో,  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ , ఇండియా మ్యాప్‌లో అమరావతి లేకపోవడాన్ని గుర్తించామని తెలిపారు. తాజాగా, ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్‌ విడుదల చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా నూత‌న మ్యాప్ విడుద‌ల చేశారు. కాగా, ఆయా పార్టీల నేత‌లు కేంద్రం స్పంద‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాయి.  మొత్తంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మ్యాప్‌ విడుద‌ల చేయ‌డం..ఆంధ్రుల ఉనికిని గుర్తించ‌డం, అవ‌మానాన్ని స‌రిదిద్ద‌డ‌మ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: