తెలంగాణ బిల్లును ముందుకు పోకుండా ఆపేస్తూ సాగదీయడం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతవరకు ఉపకరిస్తుంది అన్నది తాజాగా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అలా కాదని మరో మార్గం ఏదైనా ఉందా అంటే ఇప్పటికిప్పుడు ఏమి కనిపించడం లేదు సమైక్యవాదులకు. అందుకే ఇప్పటికిప్పుడు ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి సాగదీతనే ఓ మార్గమని భావిస్తున్నారు. ఇందులోనైనా వారు ఎంత వరకు సక్సెస్ అవుతారన్న దానిపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలా సాగదీస్తారు, ఎంత వరకు సాగదీస్తారు, అది సమైక్యానికి ఎంతవరకు దోహదం చేస్తుంది అన్నది ఓ సారి పరిశీలిద్దాం. రాష్ట్రపతి తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయానికి 42 రోజులు గడవు అంటే వచ్చే ఏడాది జనవరి 23 వరకు ఇచ్చారు. అప్పట్లోగా సమయం సరిపోకపోతే మరో 20 రోజులు పొడగించే అవకాశం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వద్ద ఉంది. ఆయన ఎలాగు సమైక్యమే అంటున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అనుకుందాం. అంటే మొత్తం మీద 62 రోజులు ఆపవచ్చన్న మాట. ఆతర్వాత అభిప్రాయం పంపకున్నా, పంపకపోయినా కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు ముందుకు పోవచ్చు. అంటే సాగదీయడం వల్ల ప్రయోజనం లేదన్నది దీనిని బట్టి అర్థమవుతోంది. కాకపోతే తెలంగాణ ఏర్పాటును మరో రెండుమూడు నెలలు వాయిదా వేయవచ్చు, కాని సమైక్యరాష్ట్రంగా ఉంచలేం అన్న భావమే అందరిలో వ్యక్తమవుతోంది. అయితే రెండు నెలలు గడిస్తే ఫిబ్రవరి నెల మొదటి వారం సమీపిస్తుంది. అంటే మరో రెండునెలలే కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం ఉంటుంది, అంతలోపు విభజించే అవకాశం లేకుండా చేస్తే ఇక ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చన్నది కూడా సమైక్యవాదుల్లో కనపడుతున్న ఆశ. ఇది సాధ్యమా.... అంటే కాదు అనడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి నుంచి బిల్లు అసెంబ్లీకి వచ్చాకా దానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలంటూ తెలంగాణ వారంతా పార్టీలకతీతంగా పోరాడుతారు. కాంగ్రెస్ అధిష్టానం హుకుం కాబట్టి సీమాంద్ర కాంగ్రెస్ వారు కొందరు కాని, స్పీకర్ కాని సహకరించే అవకాశాలు లేకపోలేదన్న సందేహాలయితే వ్యక్తం అవుతున్నాయి, అంతే కాదు సిఎం కూడా అధిష్టానం ఆదేశాలకు తలవంచుతాడేమో అని కూడా అంటున్నారు. అదే జరిగితే సాగదీత సాధ్యం కాదు. కాని ఇది జరగదు అన్న దానికే బలం ఎక్కువ కనిపిస్తోంది. అయితే చర్చ ప్రారంభించి సమయం సరిపోకపోతే ఇంకా సమయం కావాలని మాత్రమే సిఎం అడగవచ్చు. కాని చర్చనే ప్రారంభించకుండా సమయం సరిపోలేదనడానికి అవకాశం లేదు. అలా అని ఇప్పుడు కాకున్నా ప్రత్యేక సమావేశాలు పెట్టి తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయ సేకరణ మొదలు పెట్టి దానిని సాగదీయాలి. కాని అది కుదరని సమస్య. కారణం తెలంగాణ వారంతా దానికి ఒకే రోజులో అభిప్రాయం చెప్పేలా ఉన్నారు. దాదాపు సగం మంది ఒకే రోజులో ముగించాక మిగిలి వారి అభిప్రాయ సేకరణకు 60రోజుల పాటు సమయం తీసుకునే అవకాశం ఉండదంటున్నారు. ఇలా సాగదీతకు అవకాశం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు ఇదే మార్గం కాబట్టి సమైక్యవాదులు ఈ మార్గంలోనే ముందుకుపోతారు, ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది తెలియాలంటే వేచి చూడాలి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: