దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ 2500 జూనియర్ లైన్ మన్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్, 29, 2019 న మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది. భర్తీకి సంబందించిన ప్రక్రియ వివిధ స్థాయిల్లో ఉంది. షెడ్యూల్ ప్రకారం వ్రాత పరీక్షలు నిర్వహించటానికి సంస్థ తగు చర్యలు తీసుకుంటోంది.అయితే, ``నా కోటాలో 18 ఉద్యోగాలున్నాయి. మూడు లక్షలకు ఒక ఉద్యోగం. ఏ పోస్టు అయినా ఒకటే రేటు. నమ్మకం లేకపోతే బాండ్‌రాసిస్తా.. చెక్కులిస్త్తా``.. అంటూ నిరుద్యోగులకు టోకరావేస్తున్న ఆ సంస్థ రిటైర్డ్ అడిషనల్ ఏఈ గోకుల్ శ్యాంసుందర్ మాయ‌మాట‌లు చెప్పి వ‌సూళ్లు చేసుకుంటున్నాడు. ఆయ‌న్ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కటకటాల వెనక్కు నెట్టారు.

 

రాత పరీక్షలో మార్కులు వేయించి ఉద్యోగాలు వచ్చేటట్లు చేస్తానని చెప్పుకుంటూ, కొంతమంది ఉద్యోగార్థుల నుండి ఒకొక్క ఉద్యోగానికి రూ. మూడు లక్షలకు మాట్లాడుకుని, ముందుగా ఒక లక్ష రూపాయలు, ఉద్యోగ ఉత్తర్వులు వచ్చిన తరువాత మిగతా రెండు లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయం లో సంస్థ విజిలెన్సు విభాగం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా గోకుల్ శ్యాం సుందర్‌పై  668/2019 u /s 420 IPC క్రింద కేసు నమోదు చేశారు. సంస్థ విజిలెన్సు అధికారులు మరియు పోలీసులు కలిసి ఉద్యోగార్ధుల రూపం లో పధకం ప్రకారం వలపన్ని గోకుల్ శ్యాం సుందర్ ను సంప్రదించి అతడు ఒప్పందం కోసం రాగా పోలీసులు అతడిని  అదుపులోకి తీసుకున్నారు. 

 

అతనిని విచారించగా ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు తెలిశాయి. కేవలం అభ్యర్థులను మభ్య పెట్టి డబ్బులు వసూలు చేసుకున్న తరవాత అందులో ఎవరైనా స్వయం కృషితో ఉద్యోగం పొందితే తానే ఆ ఏద్యోగం ఇప్పించానని ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు తీసుకుని, ఉద్యోగం రాని అభ్యర్థులకు అడ్వాన్సుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాడని తెలిసింది. అంతేగాని అతను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ అధికారులకు గాని, మరి ఏ ఇతర అధికారులను కానీ ఆయ‌న‌తో ట‌చ్‌లో లేర‌ని స్ప‌ష్ట‌మైంది.

 

సంస్థ చీఫ్ విజిలెన్సు అధికారి కొండారి మురళీధర్ రావు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, సంస్థలో నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నామ‌ని, అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు దక్కుతాయన్నారు. అభ్యర్థులు  గోకుల్ శ్యాం సుందర్ వంటి దళారులను నమ్మి మోసపోవద్దని  కష్టపడి చదివి అర్హత పరీక్షల్లో తమ ప్రతిభ చాటుకుని మాత్రమే ఉద్యోగాలు పొంద‌గ‌ల‌ర‌ని స్ప‌ష్టం చేశారు. ఒకవేళ ఎవరైన అభ్యర్థులు ఇలాంటి దళారులను అశ్రయించినట్టు పరీక్షకు ముందే  తెలిస్తే అట్టి అభ్యర్థులను వ్రాత పరీక్షకు హాజరు కానివ్వబోమ‌ని తెలిపారు. ఒక వేళ ఉద్యోగం వచ్చిన తరవాత తెలిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా దళారులు, పై ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థులను సంప్రదించినట్లైతే ఆ సమాచారాన్ని విజిలెన్సు విభాగానికి 040-23431143 / 9440813884 / 9440812984కు ఫోన్ చేసి  తెలియజేయాల్సిందిగా కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: