మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిపోతున్నాయి. ఏ గంటలో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. శుక్రవారం రాత్రి శివసేన, ఎన్పీపి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శనివారం ఉదయానికి బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైపోయింది.

 

ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా అయ్యింది ? ఎలాగంటే ఎన్సీపిలో వచ్చిన చీలికే ప్రధాన కారణం. శరద్ పవార్ పక్కనే ఉంటూ మేనల్లుడు అజిత్ పవార్ చేసిన రాజకీయం కారణంగానే పార్టీలో చీలిక వచ్చింది. దాంతో అజిత్ నేతృత్వంలో 22 మంది ఎంఎల్ఏలు వేరు కుంపటి పెట్టుకున్నారు. దాంతో వారంతా బిజెపికి మద్దతు పలికారు. అందుకనే బలం లేకపోయినా బిజెపి హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది.

 

 ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు జరిగిన ప్రతి చర్చలోను అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు. కొన్నిసార్లు శరద్ పవార్ స్ధానంలో అజితే నేతృత్వం వహించారు. ఎందుకంటే పార్టీలో శరద్ తర్వాత అజితే కీలక నేత అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది అజిత్ నేతృత్వంలోనే పార్టీలో చీలిక వచ్చిందంటే ఎవరూ నమ్మలేకుండా ఉన్నారు.

 

అజిత్ నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు శరద్ కు తెలియకుండానే జరిగిందా ? అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అజిత్ దెబ్బకు మూడు పార్టీల అధినేతల మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. అర్ధరాత్రి తర్వాత ఎన్సీపిలో చీలిక రావటం, చీలిక వర్గం బిజెపితో కలిసింది. వెంటనే బిజెపి, ఎన్సీపి చీలిక వర్గం గవర్నర్ కోషియారిని కలిసింది.

 

ఇంకేముంది శనివారం తెల్లారేసరికి ఎవరికీ తెలియకుండానే దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైపోయింది. అజిత్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నిజానికి ఈ ఉపముఖ్యమంత్రి పదవేదో కోరుంటే మూడు పార్టీల కూటమిలోనే అజిత్ కు దక్కేదే. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపి, ఎన్సీపి వర్గం కలిపి 127 మంది ఎంఎల్ఏలే ఉన్నారు.

 

కాబట్టి బలపరీక్షలో ఈ ప్రభుత్వం నిలిచేది కాదు. అయితే ఈ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మూడు పార్టీలకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీన్ ఉండదు. కాబట్టి మళ్ళీ రాష్ట్రపతి పాలనో లేకపోతే ఎన్నికలో తప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: