మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్‌ పవార్‌ వ్యక్తిగత నిర్ణయం అని ఆయన ప్రకటించారు. అజిత్‌ పవార్‌ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదన్నారు. అజిత్‌ పవార్‌ని తాము సమర్థించడం లేదన్నారు. తాజా పరిణామాలపై ట్విటర్‌ వేదికగా స్పందించారు.

 

ఎన్సీపీలో ఇతర నేతలు కూడా అలాగే ప్రకటనలు చేస్తున్నారు. ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. భాజపాతో కలిసి నడవడం ఎన్సీపీ పార్టీ నిర్ణయం కాదన్నారు. దీనికి శరద్‌ పవార్‌ మద్దతు లేదని వెల్లడించారు.

 

అయితే.. మహారాష్ట్ర ప్రజలు భాజపాకు పూర్తి మెజారిటీ ఇచ్చారని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్బంగా ఆయన శివసేనపై విమర్శలు గుప్పించారు.

 

మహారాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని.. ‘కిచిడీ’ ప్రభుత్వాన్ని కాదని అన్నారు. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కి కూడా ధన్యవాదాలు తెలిపారు.

 

అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ..ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఏ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. రైతాంగ సంక్షోభం లాంటి అనేక సమస్యల్ని మహారాషట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు. అందుకే సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు. ప్రజలకు సుస్థిర పాలన అందించాలనే లక్ష్యంతో భాజపాతో కలవడానికి అజిత్‌ పవార్‌ అంగీకరించారని బీజేపీ నేతలు అంటున్నారు. మరికొంత మంది ఎన్సీపీ నేతలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చారని తెలిపారు. మహారాష్ట్రలో రాత్రికి రాత్రి పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనుకున్న తరుణంలో అనూహ్యంగా భాజపా-ఎన్సీపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: