ఆర్టీసీ సమ్మె ముగిసిందని భావిస్తుంటే , ప్రభుత్వ వ్యవహారశైలితో విసిగిపోయిన కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టారు. గత 48 రోజులుగా సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు , ప్రభుత్వం భేషరతుగా విధుల్లో చేర్చుకుంటామంటే సమ్మె విరమించడానికి సిద్ధమని ప్రకటించారు . అయితే ప్రభుత్వం మాత్రం కార్మికులను భేషరతుగా విధుల్లో చేర్చడానికి సుముఖత వ్యక్తం  చేయకపోగా, ఆర్టీసీ అప్పుల్లో ఉందని , రూట్ల ప్రయివేటీకరణ పై న్యాయస్థానం తీర్పు వెలువడిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది .

 

దీనితో ప్రభుత్వం , ఆర్టీసీ కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకునే అవకాశం లేదని భావిస్తోన్న కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, మరోమారు సమ్మెకు సై అంటున్నారు .శుక్రవారం ఆర్టీసీ డిపోల ముందు సేవ్ ఆర్టీసీ పేరిట ఆందోళనలు చేపడుతున్నారు . ఇప్పటికే 48  రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందంటున్న ఆర్టీసీ యాజమాన్యం , ప్రభుత్వం ఎందుకనీ కార్మికులు తమంతటా, తామే వచ్చి విధుల్లో చేరుతామంటే ఎందుకు  మొండి పట్టుదలకు పోతుందోన్న ప్రశ్న తలెత్తుతోంది . ఒక విధంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె సుదీర్ఘ కాలం కొనసాగడానికి ప్రభుత్వ వైఖరే కారణమన్న విమర్శలు లేకపోలేదు . ఇప్పుడు కార్మికులు తమంతట, తామే  సమ్మె విరమించి వచ్చి  విధుల్లో చేరుతామంటే వారిని విధుల్లో చేర్చుకోకుండా వేచి చూసే ధోరణి అవలంభించడం ద్వారా ప్రభుత్వం, కార్మికులకు  ఎటువంటి సంకేతాలను ఇస్తుందన్నది ఇట్టే స్పష్టం అవుతోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు .

 

రూట్ల ప్రయివేటీకరణ కు అనుకూలంగా తీర్పు కోసం ప్రభుత్వం వేచి చూసిన ప్రభుత్వం, ఇప్పుడు రూట్ల ప్రయివేటీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడడం తో, పలు షరతులు విధించి కార్మికులను విధుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు . దానికితోడు లాభదాయకమైన రూట్లను ప్రయివేటుపరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది కోర్టు తీర్పు అనంతరం స్పష్టం అయింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: