కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీల‌పై క‌న్నేసిందా? ఆయా రాష్ట్రాల్లో తాము బ‌ల‌ప‌డటంలో భాగంగా కుటుంబ పెత్త‌నంలో ఉన్న పార్టీల‌ను చీల్చేందుకు ప్ర‌య‌త్నిస్తోందా? ఇందుకు మ‌హారాష్ట్ర ప‌రిణామాలే నిద‌ర్శ‌న‌మా? ఆ ప‌క్క‌నే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే స్కెచ్చు అమ‌లుకానుందా? ఇలాంటి ఎత్తుగ‌డ‌లు ప‌సిగట్టే...టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తేడా రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారా...ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర రాజ‌కీయవ‌ర్గాల్లో కొన‌సాగుతోంది.

 

మ‌హారాష్ట్రకు చెందిన ప్రాంతీయ పార్టీ అయిన ఎన్‌సీపీ చీఫ్‌గా శ‌ర‌ద్ ప‌వార్ ఉన్నారు. ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా శ‌ర‌ద్ ప‌వార్ అన్న కుమారుడు అజిత్ ప‌వార్ కొన‌సాగుతున్నారు. మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వ ఏర్పాటుపై సంక్షోభం నేప‌థ్యంలో...కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కూటమి గద్దెనెక్కేందుకు సిద్ధమై ఎడతెరపిలేకుండా చర్చలు జ‌రిపి...శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ శుక్రవారం స్వయంగా ప్రకటించారు. అయితే, ఊహించ‌ని రీతిలో బీజేపీతో క‌లిసి ఎన్‌సీపీ స‌ర్కారు ఏర్పాటు చేసింది. ఎన్‌సీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా కొన‌సాగుతున్న అజిత్ ప‌వార్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీకరించారు. ఈ ప‌రిణామం సంచ‌ల‌నంగా మారింది. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక‌ల‌కు దారి తీసింది. మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కూతురైన సుప్రియా సూలే త‌న వాట్సాప్ ద్వారా స్పందించారు. ఎన్సీపీ పార్టీ, ఫ్యామిలీలో విబేధాలు వ‌చ్చిన‌ట్లు త‌న వాట్సాప్ స్టేట‌స్ ద్వారా వ్య‌క్తీక‌రించారు. 

 


అయితే, ప్రాంతీయ పార్టీల‌పై ఇలాంటి ఎత్తుగ‌డ‌లు, కుట్ర‌లు, వ్యూహాలు ఉంటాయ‌నే...టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు జాగ్ర‌త్త ప‌డ్డార‌ని అంటున్నారు. కుటుంబంలోని వ్య‌క్తులే ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డం..నేత‌లు సైతం ఈ నిర్ణ‌యాల‌ను అనుస‌రించాల్సిన ప‌రిస్థితి ఉండ‌టం...త‌న పార్టీలో త‌న త‌ర్వాత‌ వార‌స‌త్వం విష‌యంలో...కుమారుడు కేటీఆర్‌, మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు మ‌ధ్య అప్ర‌క‌టిత పోటీ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నించిన కేసీఆర్‌...హ‌రీశ్‌ను చాలా ముంద‌స్తుగానే త‌ప్పించాడ‌ని చెప్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం త‌గ్గించ‌డం, కేటీఆర్‌ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేయ‌డం, కేబినెట్ విస్త‌ర‌ణ‌లో  తొలి ద‌ఫా అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం వంటివి ఉదాహ‌ర‌ణ‌లని చెప్తున్నారు. మొత్తంగా ప్ర‌మాదాన్ని ముందే ఊహించి (!) కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావును ప‌క్క‌న‌పెట్టేశార‌ని చెప్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: