జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల‌కు కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. ` మన నుడి - మన నది ` పేరుతో ఇటీవ‌ల కొత్త  ఉద్యమానికి నాందిప‌లికిన ఆయ‌న భాష‌ను మ‌రియు న‌దుల‌ను  కాపాడేందుకు కృషి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అయితే, ఈ కార్యాచ‌ర‌న‌లో ఆయ‌న ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం కోరుతున్నారు. 'మన నుడి - మన నది ' ఉద్యమానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి అని జ‌న‌సేన పేరుతో ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ మేర‌కు స‌ల‌హాలు, స‌మాచారం ఎక్క‌డ అందించాలో తెలియ‌జేశారు.

 

అమ్మ భాషను తెలుగు జాతి పొదివి పట్టుకోకపోతే ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో తేట తెలుగు కాస్తా మాలిన్యపు తెలుగుగా మారిపోయి చివరకు అంతరించిపోయే ప్రమాద ఘంటికలు ఇప్పుడు మోగుతున్నాయని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``మన నదులు, నీటి వనరులు కలుషితమైపోతున్నాయి. స్వచ్ఛమైన నీటి వనరులు తద్వారా ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని, తీయనైన తెలుగు భాష తద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించకపోతే మనం జాతికి ద్రోహం చేసినవారం అవుతాము. నిర్మలంగా ప్రవహించే  గోదావరి, తుంగభద్ర నదులలోకి  కాలుష్యం మెల్లగా కలిసిపోవడాన్ని పోరాట యాత్రలో ప్రత్యక్షంగా చూశాను. నిండుగా గోదావరి చెంత ఉన్నా తాగడానికి గుక్కెడు మంచి నీరులేని గోదావరి జిల్లాల గ్రామాలను వీక్షించాను. జల వనరులు విషమయం అయిపోతున్నాయి. అలాగే మన మాతృ భాషకీ ముప్పు పొంచి ఉంది. ఇటువంటి స్థితినుంచి మన భాషను, మన నదులను కాపాడుకోవడం తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నాను.`` అని త‌న ఉద్దేశాన్ని ప‌వ‌న్ వివ‌రించారు.

 

తెలుగు భాషను కాపాడుకోడానికి జనసేన ముందడుగు వేయడానికి సంకల్పించిందని ప‌వ‌న్ తెలిపారు. ``భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం అనే అంశాలను జనసేన సప్త సూత్రాలలో పొందుపరిచిన విషయం లోక విదితమే. అందువల్ల తెలుగు భాష - మన నదుల పరిరక్షణ తన బాధ్యతగా జనసేన భావిస్తోంది. భాషను, సంస్కృతిని రక్షించకపోయినా, అవహేళన చేసినా వేర్పాటువాదాలు ప్రబలే ప్రమాదముందని తెలంగాణ ఉద్యమ అనుభవాలు మనకు తెలియచేస్తున్నాయి. ప్రపంచీకరణకు నాంది పలికిన అమెరికాలో ప్రస్తుతం జాతీయవాదం తెర మీదకు వచ్చిన సంగతి మనం విస్మరించగలమా? మెసపుటోమియా వేర్పాటువాదం, యూరోప్ (బ్రెగ్జిట్)  విభేదాలు, స్పెయిన్ నుంచి విడిపోతామంటున్న  బార్సిలోనా వాసులు, మన దగ్గర తెలంగాణ ఆవిర్భావం. ఇవన్నీ భాష, యాస, సంస్కృతులను నిర్లక్ష్యం చేయడం వల్లనేగా...!అందువల్ల తెలుగు భాష  సజీవ భాషగా వర్థిల్లడానికి తనవంతు కృషిని చేయాలని జనసేన సంకల్పించింది`` అని తెలిపారు.

 

``మొఘలాయిలు, ఐరోపా మిషనరీల పాలనలో  తెలుగు భాషను ప్రజలే రక్షించుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ ప్రజలే తెలుగు భాషను సజీవ భాషగా కాపాడుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష, నదుల  పరిరక్షణకు ఉద్యమం నిర్మించడానికి జనసేన ముందడుగు వేస్తోంది. 'మన నుడి - మన నది' అనే యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాము. ఇది కాలపరిమితి లేని ఒక నిరంతర ప్రక్రియ. ఇందులో  భాగంగా  తెలుగు భాష నిపుణులు, అభిమానులు, జలవనరుల శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులను సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము`` అని పేర్కొన్నారు.

``తెలుగు జీవ భాషగా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుపండి. మీ  సూచనలు, సలహాలు స్వీకరించడానికి  ప్రత్యేక విభాగాలను జనసేన పార్టీ విజయవాడ, హైదరాబాద్ కార్యాలయాలలో  ఏర్పాటు చేస్తున్నాము. పది రోజులులోగా మీ అమూల్యమైన సూచనలు అందచేయండి. ఈ విభాగాల  వివరాలను ఈ దిగువన పొందుపరుస్తున్నాము. అనంతరం ఒక నిపుణుల కమిటీని నియమిస్తాము. మన విద్యార్థులకు  ఉపయుక్తంగా వుండే విద్యావిధానంపై ఈ కమిటీ ఒక నివేదికకు రూపకల్పన చేస్తుంది. వివిధ దేశాలలో అమలులో ఉన్నవిద్యావిధానాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి విధానం ఉపయోగకరంగా ఉంటుందో ఈ కమిటీ సూచిస్తుంది. ముఖ్యంగా పేరెన్నికగన్న ఫిన్లాండ్ విద్యా విధానంలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో పరిశీలిస్తుంది. తెలుగు భాషను పరిరక్షించుకుంటూనే ఇంగ్లీషులో ప్రావీణ్యం సాధించడం, మేలైన ఉద్యోగ అవకాశాలను మన యువత పొందడమే లక్ష్యంగా ఈ కమిటీ తన నివేదికను రూపొందిస్తుంది. మీ సలహాలు స్వయంగా గాని లేదా వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారాగాని తెలియచేయవచ్చు. ఈ ప్రత్యేక విభాగాలు ఈ నెల 25 వ తేదీ (సోమవారం) నుంచి డిసెంబర్ 4 వ తేదీ (బుధవారం) వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాయి.`` అని వివ‌రించారు.

 

జ‌న‌సేన అందించిన ప్ర‌త్యేక విభాగాల వివ‌రాలివి.
విజయవాడ:
'మన నుడి -మన నది' ప్రత్యేక విభాగం,
డోర్ నెంబర్ : 59 - 14 - 9 
కడియాల వెంకయ్య కస్తూరి భవన్
మేరీస్ స్టెల్లా కళాశాల ఎదురుగా 
మైనేని రోడ్ , గాయత్రి నగర్
బెంజ్ సెంటర్ , విజయవాడ-520008 

విజయవాడ బృందం వివరాలు;
 ఎల్. జోగినాయుడు 
 ఎల్.శ్యాం
వివేక్ 
వాట్సాప్ నెంబర్: 6304900788
e-mail: mananudi_mananadi@janasenaparty.org 
-------------------------------------
హైదరాబాద్:
'మన నుడి -మన నది' ప్రత్యేక విభాగం
ఫ్లాట్ నెంబర్ 12 , రోడ్ నెం. 72,
ప్రశాసన్ నగర్,
జూబిలీహిల్స్ ,
హైదరాబాద్-500033
హైదరాబాద్ బృందం వివరాలు;
పి.శ్రీనివాస రావు 
ఎ.జయ కళ్యాణి 
 ఎ.ప్రణయ్ 
 వాట్సాప్ నెంబర్:6304900787
e-mail: mananudi_mananadi@janasenaparty.org

మరింత సమాచారం తెలుసుకోండి: