డిసెంబర్ 1 నుండి, జాతీయ రహదారులలోని టోల్ ప్లాజాల్లోని అన్ని రోడ్డులు ఫాస్ట్‌టాగ్ లేన్‌లుగా మార్చబడతాయి మరియు ఎలక్ట్రానిక్ ట్యాగ్‌లు లేకుండా వచ్చే వాహనాలకు టోల్ ఫీజు రెట్టింపు వసూలు చేయబడతాయి అని కేంద్రం ప్రకటించింది. టోల్‌గేట్ల వద్ద ఛార్జీల చెల్లింపులను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ వ్యవస్థ త్వరలో ప్రారంభం కాబోతోంది. డిసెంబర్‌ 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

ఫాస్టాగ్ అంటే ఏమిటి? 

ఫాస్టాగ్‌ కలిగిన వాహనం టోల్‌ ప్లాజా దాటి వెళ్లినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతికత ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి. టోల్ ఫీజు లింక్‌ చేసిన బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టాక్స్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫాస్టాగ్‌ ఆర్ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను వాహనం ముందు భాగంలో అద్దంపై అతికించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ బ్యాంకుల నుంచి పొందొచ్చు. అందుకోసం 23 బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమెజాన్‌తో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇక పేటీఎంలోనూ ఫాస్టాగ్‌ లభిస్తోంది. 

ఫాస్టాగ్ ను ఎలా ఉపయోగించాలి? 

టోల్ ప్లాజాలు మరియు బ్యాంకుల నుంచి ఉచితంగా ఫాస్టాగ్ లు పొందవచ్చు కాని వీటిని ఉపయోగించాలంటే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ను మీ బ్యాంకు ఖాతాతో జత చేసేందుకు ‘మై ఫాస్టాగ్’ యాప్‌ను మీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాహన రిజిస్ట్రేషన్‌ నెంబర్ ను ఎంటర్‌ చేయడం ద్వారా సేవలను పొందచ్చు. ఈ యాప్‌ను ఉపయోగించి యూపీఐ పేమెంట్స్‌ ద్వారా మీ ఫాస్టాగ్‌ను రీఛార్జి చేసుకోవచ్చు. పాస్టాగ్‌ను వేరే వాహనానికి ఉపయోగించడానికి వీల్లేదు. ఒక వాహనానికి మాత్రమే వినియోగించేలా దీన్ని రూపొందించారు. ఫాస్టాగ్‌ వల్ల నగదు చెల్లింపుల్లో ఇబ్బందులను అధిగమించొచ్చు. అలాగే టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి అటు ఇంధనం మిగలడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: