విలాస పురుషుడు. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త నిత్యానంద మ‌రోమారు సంచ‌ల‌న ప‌రిణామాల‌తో వార్త‌ల్లోకి ఎక్కారు. బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ దంపతులు తమ కూతుళ్ల‌ను అక్ర‌మంగా నిత్యానంద స్వామి త‌న ఆశ్రమంలో ఉంచుకున్న విష‌యాన్ని పేర్కొంటూ...గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించడం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఎపిసోడ్‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్న పోలీసుల‌కు అనేక సంచ‌ల‌న విష‌యాలు తెలిశాయి. నిత్యానంద అమ్మాయిల‌తో వీడియోలు తీయించే విధానం... ఆయ‌న జంప్ జిలానీ అయింది, స‌ముద్రంలో షెల్ట‌ర్ పొందుతున్న‌ది పోలీసులు వివ‌రించారు.

 

బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. 2013లో నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో వారిని ఈ దంప‌తులు చేర్పించారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులు... ఇటీవల ఆ నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న యోగిన సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న శర్మ దంపతులు కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా.. అందుకు నిరాకరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మేజర్లు అయిన మరో ఇద్దరు కూతుళ్లు మాత్రం వారి వెంట రావడానికి నిరాకరించారు. ఇలా శర్మ దగ్గరికి వచ్చిన కూతురు(15) ఒకరు మాట్లాడుతూ సంచ‌ల‌న విష‌యాల‌ను పంచుకున్నారు. నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా తమను వేధింపులకు గురిచేసేవారని పేర్కొంది. ‘2013 మేలో గురుకులంలో చేరాను. మొదట్లో అన్నీ బాగానే ఉండేవి. చాలా సరదాగా గడిచిపోయేది. అయితే 2017 నుంచి మాకు నరకం మొదలైంది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు మాతో ప్రమోషనల్‌ వీడియోలు చేయించేవారు.  ఆ వీడియోల కోసం అర్ధరాత్రి మమ్మల్ని నిద్రలేపేవారు. మాకు బాగా మేకప్‌ వేసి.. పెద్ద పెద్ద నగలు అలంకరించి స్వామీజీ వద్దకు తీసుకువెళ్లేవారు. మా అక్కను కూడా అలాగే చేశారు. నా ముందే తనతో వీడియోలు చేయించేవారు. లక్షల్లో విరాళాలు వచ్చేలా నటించాలంటూ ఇబ్బంది పెట్టేవారు. ఇదంతా స్వామి ఆదేశాల మేరకే జరిగింది. ఆశ్రమ నిర్వాహకులు మమ్మల్ని రెండు నెలలు ఒకే గదిలో బంధించారు. మా అమ్మా నాన్నల గురించి అసభ్యంగా మాట్లాడేవారు’ అని బాధిత బాలిక వాపోయింది.

 

 

కాగా, నిత్యానందపై గతంలో కర్ణాటకలో లైంగిక దాడి కేసు నమోదు కాగా.. ఇటీవల బాలికలను అపహరించి, హింసించిన కేసులో అతడిని గుజరాత్‌ పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసుల విచారణలో భాగంగా నిత్యానంద కోర్టుకు రావాల్సి ఉండగా, వరుసగా దాదాపు 40 సార్లు న్యాయస్థానానికి హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ రూరల్‌ ఎస్పీ ఆర్‌వీ అసరి మాట్లాడుతూ.. కర్ణాటకలో ఆయనపై లైంగిక దాడి కేసు నమోదైనప్పుడే విదేశాలకు పారిపోయి ఉంటాడన్నారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌ 30న నిత్యానంద పాస్‌పోర్ట్‌ గడువు ముగిసింది.నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి.  మ‌రోవైపు, నిత్యానంద నేపాల్‌ మీదుగా ఈక్వెడార్‌కు పారిపోయినట్టు కొంద‌రు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: