ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలవక ముందు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సామాన్య ప్రజానికానికి తెలీదు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, మిగతా జేఏసీ నాయకులను నమ్మి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై నేటికి 51రోజులైంది. సీఎం కేసీఆర్ సమ్మె చేస్తున్న కార్మికులను విధుల్లోకి తీసుకోవటానికి రెండు సార్లు గడువు ఇచ్చారు. కానీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ఇతర నేతల మాటలను నమ్మి ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరలేదు. 
 
హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవటంతో ప్రభుత్వం షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి కోరారు. కానీ అప్పటికే కార్మికులను విధుల్లో తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని హైకోర్టులో చెప్పిన ప్రభుత్వం కార్మిక సంఘాల నిర్ణయం పట్ల స్పందించలేదు. ఈ 51 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మెలో 30 మంది ఆర్టీసీ కార్మికులు వివిధ కారణాలతో మృతి చెందారు. జేఏసీ నాయకుల మాటలు నమ్మి సమ్మెలోకి దిగిన కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రజలలో మెజారిటీ ప్రజలు అశ్వత్థామరెడ్డి నిర్ణయాల వలనే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమ్మె వలన తెలంగాణ రాష్ట్రంలోని 5,100 రూట్లలో ప్రైవేట్ బస్సులను నడపటానికి ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తోంది. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగాలు ఉంటాయా..? లేదా..? అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరకటం లేదు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాటలను నమ్మి కార్మికులు మోసపోయారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
 
కార్మికులు సమ్మె ఇప్పుడు విరమించినా లాభమేంటని గతంలో ప్రభుత్వం గడువు ఇచ్చినపుడే విరమించవచ్చు కదా అనే ప్రశ్నలు జేఏసీ నాయకులకు, ఆర్టీసీ కార్మికులకు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. కొందరి స్వార్థ రాజకీయాలకు ఆర్టీసీ కార్మికులు, కార్మికుల కుంటుంబాలు బలయ్యాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: