తెలంగాణలో మంత్రి కాన్వాయ్ కు జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చిటూరు గ్రామం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని కారు బోల్తా పడింది. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ కారు. వేగం కారణంగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. సంఘటన స్థలాన్ని జనగామ డి సి పి శ్రీనివాస్ రెడ్డి ఏసిపి వినోద్ కుమార్ సీఐ మల్లేష్ యాదవ్ పరిశీలించారు.

 

బుల్లెట్ ప్రూఫ్ కార్ డ్రైవర్ పార్ధ సారధి, మంత్రి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంత్రి దయాకర్ రావు హైదరాబాద్ నుంచి పాలకుర్తి వస్తుండగా లింగాల ఘనపురం మండలం చీటూరు గ్రామ శివారులో కాన్వాయ్ లోని వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.

ముందు వాహనంలో ఉన్న మంత్రి దయాకర్ రావు గాయపడిన వారిని వెంటనే తన వాహనం లో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . కారు డ్రైవర్ పార్థసారథి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గన్ మెన్ నరేష్ తలకు గాయాలయ్యాయి. మంత్రి దయాకర్ రావు పిఏ శివ, అటెండర్ తాతారావు కు తీవ్ర గాయాలయ్యాయి.

 

సంఘటనా స్థలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయినట్టు తెలిసింది. డ్రైవర్, సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ మృతితో ఆయన కంటతడి పెట్టారు. ఆ తర్వాత ఆయన ధైర్యం తెచ్చుకుని క్షతగాత్రులకు మెరుగై వైద్యం అందేందుకు చర్యలు తీసుకున్నారు. అతి వేగమే కారు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: