తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డి త‌మ ప‌రిపాల‌న‌లో, వ్య‌క్తిగ‌త అంశాల్లో హైంద‌వానికి ఒకింత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వెనుక బీజేపీ బ‌ల‌ప‌డ‌టాన్ని అడ్డుకోవ‌డ‌మనే రాజ‌కీయ కోణం ఉంద‌నే ప్ర‌చారాన్ని ప‌క్క‌న‌పెడితే... ఈ ఇద్ద‌రు నేత‌ల కార్య‌క్ర‌మాల‌కు ప‌లువురు స్వామీజీలు బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఇప్ప‌టికే విశాఖ శార‌ద పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర  స్వామీజీ ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను వేనోళ్ల పొగుడుతున్నారు. వారు సైతం ఆయ‌న్ను అదే రీతిలో గౌర‌విస్తున్నారు. అయితే, ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల స్వామీజీల జాబితాలో మ‌రో ప్ర‌ముఖ స్వామీ చేరారు. ఆయ‌నే  అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి.

 


వారణాసిలో లోకకళ్యాణం ప్రజా సంక్షేమం కోసం నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదవ రోజు సందర్భంగా  గణపతి సచ్చిదానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ...ఇద్ద‌రు సీఎంల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ...ఉద్యమ నాయకుడిగా ఎంతో కష్టపడి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని, ఆయనకు అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్నదని కొనియాడారు. యాదాద్రి ఆలయాన్ని పెద్ద ఎత్తున పునరుద్ధరిస్తుండటం సంతోషదాయకమన్నారు. ఆయ‌న పిలుపునిస్తే హైదరాబాద్‌లో అతిరుద్ర మహాయాగం నిర్వహిస్తానని గణపతి సచ్చిదానందస్వామి చెప్పారు. అర్చకులకు జీతా లు ఇవ్వడం చాలా గొప్ప విషయమని మైసూర్ అవధూత పీఠాధిపతి  ప్రశంసించారు.

 

ఇక ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గురించి విశ్లేషిస్తూ...తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లోనే జగన్ కూడా నడుస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి కృషి​చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.  ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ...అనువంశిక అర్చకుల వారసత్వ హక్కుల పునురుద్ధరిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ప్రతీ ఒక్కరూ ఆహ్వానించదగ్గ నిర్ణయమన్నారు. 

 

ఈ సంద‌ర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి ప‌లు రాజ‌కీయ‌, వివాదాస్ప‌ద అంశాల‌పై కూడా స్పందించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి సమయం ఇవ్వకుండానే విమర్శలు చేయడం తగదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. ఇంగ్లీషు మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లలంతా ఇంగ్లీషులోనే చదివిస్తున్నారంటూ విమర్శించారు. విదేశాలకు వెళ్లడానికి వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా ఇంగ్లీషు అవసరమన్న విషయం మర్చిపోకూడదన్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వివాదం చేయడం సరైనది కాదని గణపతి సచ్చిదానంద స్వామి ముక్తాయించారు. హిందూధర్మ పరిరక్షణ అన్నది ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: