హైద‌రాబాద్ బ‌యోడైవ‌ర్సిటీలో శనివారం జ‌రిగిన ప్ర‌మాదంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. రాయదుర్గం వైపు నుంచి మాదాపూర్ ఐటీ కారిడార్ వైపు వోక్స్‌వాగన్ పోలో కారు (టీఎస్ 09 టీడబ్ల్యూ 5665)  బయోడైవర్సిటీ ఫ్లై ఫ్లెఓవర్‌పై 104 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ...ఐటీ కారిడార్ మలుపు వద్ద వేగం నియంత్రించకపోవడంతో ఎడమవైపు అంతే వేగంతో దూసుకెళ్లి రెయిలింగ్‌ను ఢీకొట్టి గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి ఫ్లై ఓవర్ కింద రోడ్డుమీద పడి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి అక్కడే నిలుచుని ఉన్న మహిళపై పడటంతో ఆమె మృత్యువాత పడ‌టం రెండు కార్లు ధ్వంసమ‌వ‌డం తెలిసిన సంగ‌తే. ఇంత బీభ‌త్సం సృష్టించిన ఆ కారు య‌జ‌మానికి పోలీసులు ఫైన్ వేశారు. ఎంతో తెలుసా?  వెయ్యి. అవునండి అక్ష‌రాల వెయ్యి రూపాయ‌లు.!

 

ఒళ్లు గ‌గుర్పాటు సృష్టించే రీతిలో జ‌రిగిన ఈ ప్ర‌మాదానికి కార‌కుడిగా నిర్లక్ష్యంగా.. మితిమీరిన వేగంతో కారు నడిపిన కారు య‌జ‌మాని కృష్ణ మిలన్ రావు (27)గా పోలీసులు గుర్తించారు. ఫ్లై ఓవర్ నుంచి కారు కిందపడుతున్నప్పుడు బెలూన్ తెరుచుకోవడంతో మిలన్ కృష్ణ ప్రాణాలతో బయటపడ్డాడు. కారులో ఇరుక్కున్న అతణ్ణి స్థానికులు బయటకు లాగారు. ఈ దుర్ఘటనకు కారణమైన మిలన్‌కృష్ణతోపాటు ముగ్గురు క్షతగాత్రులను గచ్చిబౌలి కేర్ దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. కారు డ్రైవర్ మిలన్‌ ఐసీయూలో చికిత్స చేస్తున్నట్లు వివరించారు.

 

అయితే కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఆయన వివరాలు సేకరించారు. ప్రమాదానికి గురయ్యే సమయంలో కృష్ణమిలన్  కారును అతివేగంతో నడుపుతున్నట్టు స్పీడ్ గన్‌ ద్వారా గుర్తించిన పోలీసులు ఆయ‌న‌కు వెయ్యి రూపాయ‌ల‌ ఫైన్ వేశారు. ఇటీవలే ఆయనకు ఎంగేజ్ మెంట్ అయిందని స‌మాచారం. త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కృష్ణమిలన్ ప్రమాదం చేసి, ఒకరి మృతికి కారణమయ్యారు. ఇదిలాఉండ‌గా, ఈ ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద‌ వేగ నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం మూడురోజులపాటు ఫ్లై ఓవర్‌పై రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: