ఏపీ మంత్రి ధర్మాన నిరుద్యోగులపై చేసిన వ్యాఖ్యలపై ఏపీలో దుమారం రేగుతోంది. టీడీపీ శ్రేణులు రాష్ట్రంలోని నిరుద్యోగులను ధర్మాన కుక్కలతో పోల్చారంటూ  భగ్గుమంటున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారా లోకేష్ ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం అధికారం తెచ్చిన తల పొగరుకి నిదర్శనమంటూ నిప్పులు చెరిగారు.

 

 

వైసీపీ కార్యకర్తలకు గ్రామవాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి ఏడాదికి 4వేల కోట్ల ప్రజాధనం దోచేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా? గ్రామసచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాన్ని లీక్ చేసి 5లక్షలకు పేపర్ అమ్ముకొని 19లక్షల మంది నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు చప్పట్లు కొట్టాలా? అంటూ ట్విటర్ వేదికగా ఈ బాబు ప్రశ్నలు గుప్పించారు. ఇక ఇదేరకంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొంటూ,  పరిపాలిస్తే మాత్రం నిరుద్యోగ యువతే మీ ప్రభుత్వానికి చావు డప్పు కొడుతుందని లోకేశ్ హెచ్చరించారు.

 

 

ప్రసంగానికి చప్పట్లు కొట్టలేదని నిరుద్యోగుల కంటే కుక్కలు మేలు అని ఓ మంత్రి అన్నారంటూ నారా లోకేశ్ ఈ సందర్భంగా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం అధికారం తెచ్చిన తలపొగరుకు నిదర్శనం అని చిందులు తొక్కారు. కాగా, నర్సన్నపేటలో మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణ దాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

 

కుక్కకి బిస్కెట్ వేస్తే విశ్వాసంగా ఉంటుందని.. అలాంటిది నిరుద్యోగుల కోసం జగన్ ఇంత చేస్తున్నా కనీసం చప్పట్లు కొట్టడానికి చేతులు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఐతే టీడీపీ విమర్శలుపై వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించి జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రభుత్వం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం టీడీపీ నేతలకు అలవాటయిందని ధ్వజమెత్తారు..

 

 

ఇకపోతే రాజకీయమంటేనే ఓ బురద ఇక్కడ ఎవరు ఎవరిపై విసిరిన తుడుచుకుని వెళ్లుతారే తప్పా అంతగా పట్టించుకోరు. ఇలా పట్టించుకునే వారు ఉంటే దేశంలో అవినీతి ఇంతలా పెరిగేది కాదు. ఇక ఇక్కడ ఎవరి లబ్ధి వారు చూసుకుంటారు. కాని పైకి మాత్రం నీతివంతులుగా రాజనీతి కధలు చెబుతారు అని అనుకుంటున్నారు లోకేశం మాటలు విన్న కామన్ పీపుల్..  

మరింత సమాచారం తెలుసుకోండి: