తెలంగాణ‌లో ఒక్క‌రోజే...రెండు దారుణ‌మైన ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో చోటు చేసుకోగా...మ‌రొక‌టి స‌మీపంలోని నారాయణపేట జిల్లాలో జ‌రిగింది. ఓ ప్ర‌మాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండ‌గా ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మ‌రో ప్ర‌మాదంలో...స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే, రెండు ఘ‌ట‌న‌లు అత్యంత బాధాక‌ర‌మైన‌వే  కావ‌డం గ‌మ‌నార్హం.

 

హైదరాబాద్ మేడిపల్లి పొలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడ ప్రధాన రహదారిపై మారుతి ఓమ్నీ కారు ద‌గ్ద‌మైంది. ప్ర‌ధాన ర‌హ‌దారిపై ప్ర‌యాణిస్తున్న‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఈ ఘ‌ట‌న‌లో కారు పూర్తిగా దగ్ధమ‌యింది. అయితే, ఒమ్నీ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు స‌మాచారం. వారి నుంచి పోలీసులు వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సంఘ‌ట‌న  పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

కాగా నారాయ‌ణ‌పేట జిల్లా మద్దూర్ మండలంలోని దోరేపల్లీ గ్రామ శివారులో గ‌ల‌ గండి హనుమాన్ దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొంరాస్‌పేట్ మండలం గౌరారం గ్రామానికి చెందిన ఓ కుటుంబ‌ సభ్యులు బంధువుల‌ పెళ్ళి విందుకు వెళ్లారు. వివాహ విందుకు హాజరై తిరుగు ప్రయాణంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు తీవ్ర గాయాల పాలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను, మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌తో గౌరారం గ్రామంలో ఒక్కసారిగా విషాధఛాయలు అలుముకున్నాయి.

 

ఇదిలా ఉండ‌గా, శనివారం అర్ధరాత్రి జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మ‌ర‌వ‌క‌ముందే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ప్ర‌యాణికుల్లో క‌ల‌వ‌రం చోటు చేసుకుంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: