దుబాయ్ వేదికగా తెలుగుదేశంపార్టీ-బిజెపి నేతల మధ్య చర్చలు జరిగినట్లు బాగా ప్రచారం జరుగుతోంది.  బిజెపిలోకి ఫిరాయించిన టిడిపి ఎంపి సిఎం రమేష్ తన కొడుకు రిత్విక్ నిశ్చితార్ధం శనివారం దుబాయ్ లో  జరిగిన విషయం అందరికీ తెలిసిందే.  నిశ్చితార్దం ఫంక్షన్ ను రమేష్ చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాగా కవాల్సిన వారిని మాత్రమే పిలిచారు.

 

ఆహ్వానితుల కోసం ఢిల్లీ నుండే దుబాయ్ కు ఏకంగా 17 ప్రత్యేక విమానాలనే వేశారంటేనే కార్యక్రమాన్ని ఏ స్ధాయిలో నిర్వహించారో ఎవరికి వారుగా ఊహించుకోవాల్సిందే. ఇటువంటి నేపధ్యంలోనే బిజెపి, టిడిపికి చెందిన ముఖ్యనేతలు చాలామందిని పిలిచారట. అంటే మిగిలిన పార్టీలకు చెందిన నేతలను  కూడా పిలిచినా బిజెపి-టిడిపి నేతలు విషయంలో మాత్రమే అందరూ ఆసక్తి చూపుతున్నారు.

 

ఎందుకంటే టిడిపిలో నుండి బిజెపిలోకి కొందరు ఎంఎల్ఏలు ఫిరాయిస్తారంటూ కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్ వేదికగానే ఇటువంటి చర్చలకు తెర లేచినట్లు సమాచారం. ఇండియాలో ఎక్కడ రెండు పార్టీల నేతలు కలుసుకున్నా వెంటనే విషయం బయటకు వచ్చేస్తోంది. అదే దుబాయ్ లో కలుసుకుంటే బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

 

ఎందుకంటే దుబాయ్ లో  ఈ ఫంక్షన్ కు హాజరయ్యే మీడియా వాళ్ళెవరూ ఉండే అవకాశాలు దాదాపు లేరనే అనుకోవాలి. కాబట్టి తాము మాట్లాడుకోదలచుకున్న వన్నీ నిర్భయంగా మాట్లాడుకోవచ్చు. జరిగింది కూడా అదే అని ప్రచారం. టిడిపి నుండి 12 మంది ఎంఎల్ఏలు నిశ్చితార్ధానికి హాజరయ్యారని అంటున్నారు కాని వారెవరన్నదే తెలియటం లేదు.

 

రమేష్ మీదకూడా చాలా ఆర్ధిక ఆరోపణలున్నాయి. టిడిపి హయాంలో రాయలసీమ ప్రాంతంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు దాదాపు రిత్విక్ ప్రాజెక్ట్సే చేసింది. దీనిలోనే వందల కోట్ల రూపాయలు దోచేసుకున్నట్లు స్వయంగా అప్పట్లో బిజెపి నేతలు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఆ ఆరోపణలపై ఎటువంటి చర్యలు ముందుకు సాగకుండా ఉండాలంటే టిడిపి నుండి ఎంఎల్ఏలను బిజెపిలోకి తీసుకొచ్చే బాధ్యతను కీలక నేతలు రమేష్ పైన ఉంచారట. అందుకనే రమేష్ నిశ్చితార్ధం కార్యక్రమంలో పై రెండు పార్టీల నేతల  భేటికి వెసులుబాటు కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: