అడ్డదారిలో సాధించుకున్న అధికారాన్ని ఎలాగైనా  నిలుపుకునేందుకు బిజెపి చురుగ్గా పావులు కదుపుతోంది. ఎన్నిరోజులు సిఎం కుర్చీపై బిజెపి నేత  దేవేంద్ర ఫడ్నవీస్ కూర్చుంటారో ఎవరూ చెప్పలేకున్నారు. వాస్తవానికి బలనిరూపణలో ఫడ్నవీస్ బోల్తా పడక తప్పదనే అనిపిస్తోంది.

 

ఎందుకంటే 288 ఎంఎల్ఏల అసెంబ్లీలో బిజెపికి ఉన్నది కేవలం 105 మంది మాత్రమే. ఇక ఎన్పీపి చీలిక వర్గం అజిత్ పవార్ నేతృత్వంలో ఎంతమంది ఎంఎల్ఏలు బిజెపికి మద్దతు ఇస్తున్నారన్న విషయం పెద్ద గందరగోళమే జరుగుతోంది. అజిత్ తో రెండు రోజుల క్రితం వచ్చేసిన 22 మంది ఎంఎల్ఏల్లో కొంతమంది మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయి శరద్ పవార్ నాయకత్వానికి జై కొట్టారు.

 

కొందరు ఎంఎల్ఏలు ఎన్సీపి, చీలిక వర్గం మధ్యలో దోబూచులాడుతున్నారు. దాంతో ఇటు శరద్ పవార్ నాయకత్వంలో ఎందమంది ఎంఎల్ఏలున్నారు ? అజిత్ నాయకత్వాన్ని ఎంతమంది ఎంఎల్ఏలు సమర్ధిస్తున్నారు ? అన్న విషయంలో బాగా కన్ఫ్యూజన్ కనబడుతోంది.

 

ఈ పరిస్ధితుల్లోనే ఎన్సీపి, కాంగ్రెస్  నేతలు సుప్రింకోర్టులో  వేసిన కేసు విచారణ కూడా చాలా కీలకంగా మారింది. ఆదివారం జరిగిన విచారణలో సుప్రింకోర్టు గవర్నర్ తొందరపాటును ప్రశ్నించినట్లుగానే కనబడింది. అందుకనే ఫడ్నవీస్ కు ఎంతమంది మద్దతిస్తున్నారనే విషయంలో గవర్నర్ లెక్కను సోమవారం కోర్టుకు చెప్పాలంటూ ఆదేశించటం కీలకంగా మారింది.

 

ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, ఎన్సీపిలను చీల్చే పనిలో బిజెపి నేతలు బిజీగా ఉన్నట్లు అర్ధమవుతోంది. అడ్డదారుల్లో ఇపుడు సిఎం కుర్చీలో బిజెపి నేత కూర్చున్నారు కాబట్టి ఆ పదవిని నిలుపుకోవాలంటే ప్రత్యర్ధి పార్టీలను చీల్చటమే ఏకైక మార్గం. ఎందుకంటే ఇపుడు గనుక బలనిరూపణలో ఫెయిల్ అయితే  అది నరేంద్రమోడి, అమిత్ షా కు చాలా అవమానం క్రిందే లెక్క. ఎలాగూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి అవకాశం ఉన్నంతలో ప్రత్యర్ధిపార్టీలను చీల్చటానికే బిజెపి ప్రయత్నిస్తుంది. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలను బిజెపి కంపు చేసింది మాత్రం వాస్తవం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: