వాయు కాలుష్యం ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాలకు అతి పెద్ద సమస్యగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. పరిశ్రమలు, రోజురోజుకు పెరుగుతున్న వాహనాల వలన కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రజలు కాలుష్యం బారి నుండి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
రోజురోజుకు హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరుగుతోంది. వైద్యులు చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఈ వాతావరణంలో స్వైన్ ఫ్లూ వ్యాధిని వ్యాపించే వైరస్ లు ఎన్నో రెట్లు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు. ఆస్తమా రోగులు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ఇలాంటి వాతావరణం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. వాతావరణ నిపుణులు పంజాగుట్ట, అబిడ్స్, జీడిమెట్ల, నెహ్రూ జూలాజికల్ పార్క్, బాలానగర్, బేగంపేట్ లాంటి ప్రదేశాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. 
 
నిపుణులు ప్రజలు బయటకు రావాలంటే మాస్కులు ధరించి వస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు వాహనాలు, పరిశ్రమల వలన గాలిలో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై యాక్సైడ్, హైడ్రో కార్బన్ కలుస్తున్నాయని ఈ రసాయనాలు కలిసిన గాలిని పీల్చటం వలన శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
ఆరోగ్యానికి ఎక్కువ గ్రీనరీ ఉండే ప్రదేశాల్లో గడిపితే మంచిదని, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 158గా నమోదైంది. రోజురోజుకు హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుతూ ఉండటం కూడా కాలుష్యం పెరగటానికి కారణమని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత హైదరాబాద్ నగరంలో జనాభా తగ్గుతుందని అధికారులు భావించినా జనాభా తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: