ఎవరు ఏ పార్టీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాలు స్నేహితులు అనే విషయం రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. పరిస్తితులని బట్టి వీరు వేరు వేరు పార్టీల్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా కలిసే ఉంటారనేది బహిరంగ రహస్యమే. కాకపోతే వీరిలో కొడాలి నాని, వల్లభనేని వంశీల రాజకీయ జీవితం బాగుంది. కానీ వంగవీటి రాధానే ఎటు కాకుండా అయిపోయారు. దీంతో ఈ ఇద్దరు తన స్నేహితుడికి కూడా మంచి రాజకీయ జీవితం వచ్చేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

 

మొన్నటివరకు టీడీపీలో ఉన్న వంశీ...ఇప్పుడు వైసీపీ వైపుకు రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో కొడాలి నాని, వంశీలు ఒకే పార్టీలోకి వచ్చినట్లైంది. కానీ వంగవీటి రాధా మాత్రం ఏ పార్టీలోకి వెళ్లాలో అర్ధం కానీ పరిస్తితిలో ఉన్నారు. అసలు మొదట కాంగ్రెస్ లో రాజకీయ జీవితం ప్రారంభించిన రాధా...ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ఇలా వరుసగా పార్టీలు మారుతారు వచ్చి రాజకీయ జీవితం శూన్యం చేసుకున్నారు. 

 

మొన్న ఎన్నికల ముందు రాధా వైసీపీలో ఉంటే చాలా బాగుండేది. కానీ అనవసరంగా టీడీపీలో చేరి చెడగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు టీడీపీ పరిస్థితే దారుణంగా ఉండటంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల ఆయన పవన్ కల్యాణ్ ని కలిసిన అటు వైపు వెళ్లలేదు. కానీ ఇప్పుడు వంశీ వైసీపీలోకి వెళ్లడంతో, తనని కూడా వైసీపీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కొడాలి నానితో కలిసి తన స్నేహితుడుని తమ దగ్గరకు తెచ్చుకోవాలని వైసీపీ అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇప్పటికే ఓ టీవీ ఇంటర్వ్యూలో వంశీ ఇదే విషయం గురించి చెప్పారు. రాధా చాలా మంచివారని, ఆయన రాజకీయ జీవితాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంటే మళ్ళీ రాధాని వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి నాని, వంశీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాధాని చేర్చుకోవడానికి జగన్ సుముఖంగా ఉంటారా? లేదా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: