మహా రాష్ట్ర రాజకీయాలు  ప్రస్తుతం వాడివేడిగా జరుగుతున్నాయి. రాత్రికి రాత్రి మంతనాలు జరిపి బిజెపి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో మహా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అప్పటివరకు ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతుతో శివసేన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని మహారాష్ట్ర ప్రజలే కాదు రాజకీయ వర్గాలన్నీ భావించాయి. కానీ ఊహకందని విధంగా రాత్రికి రాత్రే మంతనాలు జరిపి ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో  బీజేపీ పార్టీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిజెపి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు... డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకరం చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ కి బలనిరూపణకు ఈనెల 30 వరకు గవర్నర్ సమయం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సిపి కాంగ్రెస్ శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. 

 

 

 

 అంతేకాకుండా ఈ నెల 30 వరకు బలనిరూపణకు  బిజెపికి సమయం కేటాయిస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తనవైపుకు తిప్పుకునే అవకాశముందని అందుకే త్వరగా బలనిరూపణ పరీక్షను నిర్వహించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాయి ఎన్సీపీ  కాంగ్రెస్ శివసేన  పార్టీలు. అయితే దీని పై నేడు విచారణ కొనసాగనుంది . ఇదిలా ఉండగా  ఇప్పటికే బీజేపీకి మద్దతు తెలిపిన అజిత్ పవార్ ను ఎన్సీపీ  ఎల్పీ నేతగా తొలగించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇప్పటికే ఎన్సీపీ  ఎమ్మెల్యేలందరూ అధినేత శరద్ పవార్  వెంటే ఉంటామని శరత్ పవార్ కే తమ మద్దతు తెలుపుతాము అంటూ స్పష్టం చేస్తున్నారు. శనివారం జరిగిన ఎన్సీపీ ఎల్పీ సమావేశం లో 50 మంది ఎమ్మెల్యేలు పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం ఎన్సీపీ చెంత 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. 

 

 

 

 నిన్నటి నుంచి ఆచూకీ లేకుండా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి వచ్చి శరత్ పవార్ కే  తమ మద్దతు అంటూ వెల్లడించారని నవాబ్ మాలిక్ తెలిపారు. అనిల్ పాటిల్, దౌలత్ దరోడాను  ఢిల్లీ నుంచి ముంబై కి తీసుకు వచ్చినట్లు తెలిపారు.ఇప్పటి వరకు వాళ్ళు  హర్యానాలోని గురుగ్రమ్ లో  ఒక హోటల్లో బస చేశారని తెలుస్తోంది . ఇక రావాల్సింది ఇద్దరు ఎమ్మెల్యేలు అని... ఆ  ఇద్దరు ఎమ్మెల్యేల లో ఒకరైన నరహరి ఝిళ్వార్  ఢిల్లీలో ఓ హోటల్ లో భద్రంగా ఉన్నారంటూ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎన్సీపీకి చెందిన మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు శరత్ పవార్ కే  మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా ముంబైలోని ఓ హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బిజెపి తమ ఎమ్మెల్యేలను ప్రలోభ  పెట్టేందుకు అవకాశం ఉన్నందున శివసేన కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించారు. ఇంకొద్దిసేపట్లో ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన పార్టీలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై  విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టు బలనిరూపణపై  కీలక తీర్పు వెలువరించనుంది . ఈ క్రమంలో ఎమ్మెల్యేల సంఖ్య కీలకంగా మారనుంది.. ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా ఉండగా ప్రస్తుతం అన్ని పార్టీల దృష్టి 13 మంది స్వతంత్రులు 16 మంది చిన్న పార్టీల ఎమ్మెల్యేలు పైనే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: