రాజ‌కీయ చాణ‌క్యులుగా పేరొందిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ధ్య చిత్ర‌మైన పోలిక ఇది. రాజ‌కీయ ఎత్తుగడ‌ల్లో ఆరితేరిన ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ త‌మ పార్టీల వైఖ‌రిని కొన‌సాగిస్తూనే త‌మ వారైనా స‌రే...తేడా వ‌స్తే... `ఖేల్ ఖ‌తం..దుకాణం బంద్‌` అనే త‌ర‌హాలో ఎత్తులు వేసి ఎదుటి వారిని చిత్తు చేస్తార‌ని అంటున్నారు. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తున్న రెండు ప్ర‌ధాన‌మైన అంశాల విష‌యంలో ఇటు ప్ర‌ధాని మోదీ...అటు తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి నేప‌థ్యంలో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ రెండు అంశాలే ఒక‌టి మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వ ఏర్పాటు. రెండోది తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మె.

 

ముందుగా ప్ర‌స్తుతం దేశం మొత్తం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న మ‌హారాష్ట్ర ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ఆ రాష్ట్రంలో బీజేపీ- శివ‌సేన‌ల‌ది దీర్ఘ‌కాలిక మిత్రుత్వం. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా ఎప్ప‌ట్లాగే...శివసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది...సీట్ల సర్దుబాటు చేసుకొని ఎన్నిక‌ల్లో నెగ్గింది. అయితే, ప్రాంతీయ పార్టీ అయిన‌ శివసేన అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబట్టడంతో ట్విస్టు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ నిర్ణ‌యం ప్ర‌ధాని మోడీకి మంట పుట్టించిందంటున్నారు. జాతీయ పార్టీ హోదాలో...దేశ‌వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మిన‌హా మెజార్టీ చోట్ల అధికారం చేజిక్కుంచుకున్న‌ తాముండగా ఓ ప్రాంతీయ పార్టీ తమపై ఆధిపత్యం చెలాయించే ఆలోచ‌న చేయ‌డాన్ని జీర్ణించుకోలేద‌ని స‌మాచారం. దీంతో...ఈ ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచేయాలన్న ఆలోచనకు వ‌చ్చారు.  ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సిద్ధమ‌వుతుంటే మరోవైపు అదే ఎన్‌సీపీలోని కీల‌క వ‌ర్గంతో మంతనాలు జరిపి తమ స‌ర్కారును ఏర్పాటు చేసింది. తెల్లవారితే...సీఎం అయిపోయేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్న శివ‌సేన‌కు షాకిచ్చింది.

 

ఇక ఈ పొలిటిక‌ల్ డ్రామా కంటే ముందు నుంచి సాగుతున్న తెలంగాణలోని ఆర్టీసీ స‌మ్మె విష‌యానికి వ‌స్తే...ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని కోరుతూ..సాక్షాత్తు టీఆర్ఎస్ అండ‌తో ఏర్పాటైన సంఘం సార‌థ్యంలో స‌మ్మెకు వెళ్లారు ఆర్టీసీ కార్మికులు. అయితే, ముఖ్య‌మంత్రి దీనిపై భ‌గ్గుమ‌న్నారు. ``ఒక్క కార్పొరేష‌న్‌లో ఇలా విలీనం చేస్తే..మిగ‌తా అన్నింటి నుంచి అదే డిమాండ్ వ‌స్తుంది. కార్మిక సంఘాలు మ‌మ్మ‌ల్ని బ్లాక్‌మెయిల్ చేయ‌డాన్ని సహించం. భేష‌ర‌తుగా స‌మ్మె విర‌మించాల్సిందే. లేదంటే వారిష్టం`` అంటూ ఆది నుంచి..నేటికీ మొండిప‌ట్టుపై ఉన్నారు. త‌ద్వారా ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌ర్కారును ఒత్తిడి చేయాల‌నే ఆలోచ‌న‌ను క‌ల‌లో కూడా చేయ‌ని ప‌రిస్థితి క‌ల్పించారు. ఇలా...ఇటు ప్ర‌ధాని..అటు ముఖ్య‌మంత్రి ఒక‌రు బ‌హిరంగంగా ప్ర‌క‌టించి...ఇంకొరు అద్భుత‌మైన చాణ‌క్య రీతితో త‌మ‌ను ఇర‌కున పెట్టేవారికి షాకిచ్చార‌ని అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: