తీవ్ర ప‌రాభ‌వంతో కుమిలిపోతున్న టీడీపీకి ఆక్సిజ‌న్ అందించే కార్య‌క్ర‌మాల్లో భాగంగా పార్టీ అధినేత చం ద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా ఫ‌లించిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. అనంత‌రం పార్టీలో ఏర్ప‌డిన తీవ్ర గంద‌ర‌గోళాన్ని త‌గ్గించేందుకు చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే విశాఖ‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, కృష్ణా జిల్లాల‌కు సంబందించి స‌మీక్ష‌లు చేశారు. అయితే, ఆయా జిల్లాల్లో స‌మీక్ష‌లు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేద‌ని టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు.

 

ఇక‌, త‌ణుకులోనూ చంద్ర‌బాబు వ్యూహం ప‌లించ‌లేదు. కీలక నాయ‌కులుగా, ప్ర‌జ‌లకు బాగా ద‌గ్గ‌రైన నాయ‌కులుగా పేరు తెచ్చుకున్న నాయ‌కులు సైతం స‌మీక్ష‌కు డుమ్మా కొట్ట‌డం, కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాల‌కు చంద్ర‌బాబు విలువ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ స‌మీక్ష‌లు ప్ర‌హ‌స‌నంగా మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు తాజాగా సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు క‌డప‌లోని టీడీపీ ప‌రిస్థితిపై నిర్వ‌హిస్తున్న స‌మీక్ష ఏ రేంజ్‌లో ఉంటుంది ?  ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితిని ఏమైనా లైన్‌లోకి తీసుకువ‌స్తుందా ?  నాయ‌కుల‌ను గాడిలో పెడుతుందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

 

వాస్త‌వానికి క‌డ‌ప అంటే వైసీపీకి కంచుకోట‌గా మారిపోయింది. 2014లో టీడీపీ ఒక స్తానంలో విజ‌యం సా ధించింది. ఇక‌, ఈ ఏడాది అది కూడా కోల్పోయి.. జీరోకు దిగ‌జారిపోయింది. పైగా ఇక్క‌డ కీల‌క నాయ‌కులుగా ఉన్న సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ రెడ్డి వంటి వారు పార్టీ మారిపోయారు (అయితే, వీరు పార్టీ మారింది బాబు క‌నుస‌న్న‌ల్లోనేన‌నే ప్ర‌చారం ఉంది). 

ఇక‌, బీటెక్ ర‌వి వంటి వారు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూపించే నాయ‌కులు కాదు. మ‌రోప‌క్క‌, రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం హ‌వా కూడా త‌గ్గిపోయింది. దీంతో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా ఉంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహం ఏ మేర‌కు  ఫ‌లిస్తుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా పార్టీని గాడిలో పెట్టేందుకు బాబు ప్లాన్లు అన్ని అట్ట‌ర్ ప్లాప్ అవుతున్నాయ‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: