తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటన చేసి, మంగళవారం నుండి విధులకు హాజరు కావాలని కార్మికులకు పిలుపునిచ్చింది.. గత వారంలో కార్మికులు సమ్మె విరమణకు సిద్దంగా ఉన్నామని..ప్రభుత్వం కార్మికులను ఎటువంటి షరతు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. అయినా..ప్రభుత్వం నుండి స్పందన లేదు. దీంతో..తిరిగి సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, కొద్ది సేపటి క్రితం ఆకస్మికంగా కార్మిక సంఘాల జేఏసీ సమావేశమైంది.  రెండో షిఫ్టు కార్మికులు సైతం ఉదయమే డిపోల వద్దకు చేరుకొని విధుల్లోకి చేర్చుకొనేలా అక్కడి డిపో మేనేజర్ల పైన ఒత్తిడి తేవాలని సూచించారు. అయితే, ఇంత సడన్ గా కార్మిక సంఘాల జేఏసీ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు ఏం జరిగిందనే చర్చ మొదలైంది. కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళ్లి ..చేసిన మంత్రాంగం.. కొత్త నిర్ణయాల వెనుక జరుగుతున్న కసరత్తు దీనికి కారణమని తెలుస్తోంది.

 

 

   తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు ముగింపు పలికారు. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవటం..ప్రజల్లో అసహనం పెరిగిపోతుండటం..కార్మికుల్లో సైతం ఆగ్రహం వ్యక్తం అవుతున్న సమయంలో జేఏసీ నేతలు వ్యూహాత్మకంగా వెనుకుడుగు వేసారు. 52 రోజుల సమ్మెకు ముగింపు పలికారు. మంగళవారం నుండి కార్మికులు విధుల్లోకి హాజరవ్వాలని జేఏసీ నేత అశ్వద్దామ రెడ్డి ప్రకటన చేసారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోయినా..ఇంత సడన్ గా కార్మిక సంఘాల జేఏసీ ఎందుకు సమ్మె విరమణ నిర్ణయం ప్రకటించదనేది చర్చకు కారణమైంది. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వం గెలవలేదు..కార్మికులు ఓడిపోలేదని కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు.

 

 

   తాము ప్రజా రవాణా వ్యవస్థను రక్షించుకొనేందుకే ఈ సమ్మె విరమణ నిర్ణయం తీసుకుంటున్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. గతంలో కార్మికులు యూనియన్లతో సంబంధం లేదని అఫిడవిట్లు ఇస్తేనే విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ, కార్మికులు ఆ సమయంలో స్పందించలేదు. దీంతో..కోర్టులో సైతం ఒక రకంగా కార్మికులు ఆశించిన దానికి భిన్నంగా వ్యవహారం లేబర్ కోర్టుకు చేరింది. ప్రభుత్వం తీసుకున్న ప్రయివేటు రూట్ల నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. ఇదే సమయంలో తాము విధుల్లో చేరుతామని చెబుతున్నా..డిపోల వద్ద కార్మికులు పడి గాపులు కాస్తున్నా..ఆర్టీసీ యాజమన్యం స్పందించలేదు. దీంతో పాటుగా కార్మికుల ఆత్మహత్యలు వీరి మీద ప్రభావం చూపించాయి. తక్షణం సమ్మె విరమించకపోతే ఇదే సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మిక సంఘాలకు సమాచారం అందింది.

 

 

   గవర్నర్ తమిళసై తో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆర్టీసీ పరిస్థితిని సీఎం వివరించినట్లుగా విశ్వసనీయ సమాచారం. అదే విధంగా హైకోర్టు అనుమతి..కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం తాము ఆర్టీసీని ప్రయవేటీకరణ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా ముఖ్యమంత్రి వివరించినట్లు తెలుస్తోంది. దీంతో..కార్మికులను పరిగణలోకి తీసుకోవాలని..వారికి నష్టం కలిగించేలా చర్యలు వద్దని గవర్నర్ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..పాటుగా రూట్ల ప్రయివేటీకరణ దిశగా ముఖ్యమంత్రి ఈ రాత్రి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ కార్మిక సంఘాలకు సమాచారం అందింది.

 

 

   తెగే వరకూ లాగించటం మంచిది కాదనే నిర్ణయానికి కార్మిక సంఘాల నేతలు వచ్చారు. రాజకీయ పార్టీల నేతల జోక్యం కంటే..ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయాలను అడ్డుకోవాలి..అదే విధంగా ఆర్టీసీ మీద ఆధారపడి ఉన్న ాకార్మికులకు మేలు జరగాలంటే వెంటనే సమ్మె బేషరతుగా విరమించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ వెంటనే ఆకస్మికంగా సమ్మె విరమణ ప్రకటన చేసారు. ఇక, ప్రభుత్వంసైతం ఈ రాత్రికి కార్మికులకు విధుల్లోకి చేరే అంశం పైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: