ఎన్నికల్లో ఘోర పరాజయం చంద్రబాబునాయుడుకు సరిగా నిద్ర కూడా పట్టనీయటం లేదు. ఓటమి దెబ్బకు ఏ రోజు ఏ నేత పార్టీని వదిలేస్తారో ఎవరికీ అర్ధం కావటం లేదు. తాజాగా కృష్ణా జిల్లాలోని  పెనమలూరు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ బోడే ప్రసాద్ కూడా టిడిపికి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. దాంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

 

పెనమలూరు నియోజకవర్గమంటే విజయవాడకు అనుకునే ఉంటుంది. అందుకనే ఈ నియోజకవర్గం కూడా విజయవాడ సిటి నియోజకవర్గాల్లో ఒకటిగానే అందరూ లెక్కేస్తారు. ఇటువంటి నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో వైసిపి నేత కొలుసు పార్ధసారధి చేతిలో బోడె ఓడిపోయారు. బోడె ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుండే కష్టాలు మొదలయ్యాయట.

 

అప్పటి వరకూ బోడెకు వ్యతిరేకంగా ఉన్న మరో వర్గం మాజీ ఎంఎల్ఏను తొక్కేస్తోందట. చంద్రబాబును కలిసి పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను చెప్పుకున్నా ఆశించిన స్పందన కనబడలేదట. పైగా జిల్లా మొత్తం మీద బోడెకు మద్దతుగా నిలబడేది ఒక్క గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మాత్రమే. అలాంటి వంశీ కూడా పార్టీకి దూరమైపోవటంతో వంశీ మీదున్న కోపమంతా కొందరు నేతలు బోడె మీద చూపుతున్నారట.

 

కాల్ మనీ సెక్స్ రాకెట్లో బోడె పాత్రపై అప్పట్లో ప్రముఖంగా కథనాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తెరముందు కనబడింది బోడె ప్రసాదే  అయినా తెరవెనుక ఉండి మొత్తం కథంతా  నడిపింది మాత్రం వేరే నేతలు. అంటే హోలు మొత్తం మీద ప్రస్తుతం బోడెను ఎవ్వరూ పట్టించుకోవటం లేదన్న విషయం అర్ధమైపోయింది.

 

సో పార్టీలో తనకు వ్యతిరేకంగా  జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బోడె టిడిపిలో ఉండటం అనవసరమని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత తన మిత్రుడు వంశీనే సంప్రదిస్తారు కదా ? బోడె కూడా అదే చేశారట. మరి ఇద్దరి భేటిలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో తెలీటం లేదు. మొత్తం మీద బోడె టిడిపిలో ఎక్కువ రోజులుండే అవకాశం లేదని మాత్రం అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: