టీఎస్ఆర్టీసీ సమ్మె ముగిసింది.కార్మికులు రేపటినుండి విధుల్లో చేరబోతున్నారని ఐకాస నాయకులు తెలిపారు . ఈ సందర్భమగా ఐకాసా నాయకుడు అశ్వథామ రెడ్డి మాట్లాడుతూ, 52 రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలవలేదని వ్యాఖ్యానించారు. నైతిక విజయం కార్మికులదేనని ప్రకటించారు. తమ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించామని చెప్పారు. లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

 

 

   సమ్మె చేస్తున్న సమయంలో పలువురు కార్మికులు చనిపోవడం బాధాకరమని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయటానికి జేఏసీ కృషి చేస్తుందని తెలిపారు. కార్మికులు చేసిన సమ్మె న్యాయబద్ధమైందని తెలిపారు. 52 రోజుల పాటు సుదీర్ఘంగా చేసిన శాంతియుత పోరాటం వృథాగా పోదన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

 

 

    టీఎస్ఆర్టీసీని రక్షించుకోవడంతో పాటు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈ సుదీర్ఘ పోరాటం చేశాం. ఈ పోరాటంలో నైతిక విజయం కార్మికులదే. కార్మిక వర్గమంతా ఇన్ని రోజుల పాటు ఐకమత్యంతో ఉండి జేఏసీ ఇచ్చిన పిలుపును ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లింది. సమ్మెలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. ఈ పోరాటం వృథా పోదు. భవిష్యత్‌లో ఈ మన సమస్యల పరిష్కరానికి తప్పకుండా మార్గం చూపుతుందని భావిస్తున్నా’ అని అశ్వత్థామ రెడ్డి అన్నారు.

 

     హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు, కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీలో జరుగుతున్న సమ్మెను నవంబర్ 25 నుంచి విరమిస్తున్నట్లు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ వెంటనే వారి విధులకు హాజరు కావాలని సూచించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులను కల్పించి కార్మికులపై ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: