రాజ‌కీయాల‌లో జ‌నసేన పాత్ర గురించి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చింది, ఎలా ముందుకు సాగుతుంది, ఏ ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుంది మ‌రోమారు జ‌న‌సేనాని ముఖ్య‌నేత‌ల‌కు తెలియ‌జేశారు.  హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  అధ్యక్షోపన్యాసం చేశారు. ఓట్లు పడతాయా లేదా అనే ఆలోచనతో కాకుండా ప్రజలకు మేలు కలుగుతుందా లేదా అనే యోచనతో  రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అవకాశవాద రాజకీయాలకు జనసేన పార్టీ దూరంగా ఉంటుందని, పార్టీ భావజాలంకు అనుగుణంగా పని చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

 

విశాఖపట్నంలో ఈ నెల 3వ తేదీన జరిగిన లాంగ్ మార్చ్ అపూర్వ విజయానికి  పార్టీ ఆలోచన విధానమే కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. "ఆంధ్ర ప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కొత్త తరం, పాత తరం మధ్యన అంతరాలు ఉన్నాయి. భావితరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోకపోతే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కన పెడదాం. నేను బహిరంగంగా ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా. ఇలా మాట్లాడితే ఒక వర్గానికి కోపం వస్తుందని, వేరేలా మాట్లాడితే ఇంకొక వర్గానికి కోపం వస్తుందని భావించి నా పంథాను మార్చుకోను. భావితరాలకు మేలు కోసం ఏమి చేస్తే మంచిదో అదే మాట్లాడతాను. మనం ఏం మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడదాం.`` అని నేత‌ల‌కు వివ‌రించారు.


 
పోరాట యాత్ర సందర్భంగా తాను అనేక విషయాలు గమనించని, పాతుకుపోయిన సమస్యలను చూశాన‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు.``మనకు వనరులు తక్కువగా ఉన్నాయి. అయితే ఆకాంక్షలు అపరిమితంగా ఉన్నాయి. యువతకు ఉపాధి మార్గాలు చూపకపోతే అశాంతి నెలకొంటుంది. తద్వారా సమాజంలో అనేక విభజనలు జరుగుతాయి. ప్రత్యర్ధి పార్టీల వారు ప్రలోభపెట్టో, భయపెట్టో ప్రజలపై పట్టు సాధించుకోవాలని చూస్తున్నారు. అయితే జనసేన పార్టీ ప్రజల అభిమానంతో క్రమంగా, స్థిరంగా ఎదుగుతుంది. సత్యం నిష్టురంగా ఉన్నా మనం స్పష్టంగా మాట్లాడదాం. అయితే దీనికి ప్రజల నుంచి మద్దతు ఒక్కసారి కాకుండా క్రమక్రమంగా వస్తుంది. `` అని ధీమా వ్య‌క్తం చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: