రాయలసీమ వెనుకబాటుతనం, ఆ ప్రాంతం నుంచి వ‌చ్చిన ఏపీ సీఎం జగన్ గురించి సోమ‌వారం ఉదయం వరుస ట్వీట్లు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానికి కొన‌సాగింపుగా ప‌లు కామెంట్లు ..కీల‌క ప్ర‌క‌ట‌న‌లు సైతం చేశారు. రాయ‌ల‌సీమలోని ప్ర‌జ‌లు, రాజ‌కీయ జీవితం..ఇత‌ర‌త్రా అంశాల గురించి ప్ర‌స్తావించిన ఆయ‌న హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అధ్యక్షోపన్యాసంలో మ‌రిన్ని కామెంట్లు చేశారు. త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తాన‌ని ప్ర‌క‌టించి...ఇందుకు కార‌ణాల‌ను వెల్ల‌డించారు. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న నాగ‌బాబు సైతం పాల్గొన్నారు.

 

రాయలసీమలో జనసేనకు అపారమైన క్యాడర్ ఉందని రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నాయ‌కుల‌కు ప‌వ‌న్ వివ‌రించారు. సీమ‌లో క్యాడర్‌ను సమష్టిగా ఉంచి వారిని ముందుకు నడిపే నాయకత్వాన్ని సిద్ధం చేద్దాం. నిలకడగా పనిచేసేవారిని రాయలసీమలో గుర్తించాలి. కార్యకర్తలను రక్షించుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఉంది. వారికి అండగా నిలుద్దాం. త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తా. పర్యటనకు సంబంధించిన కార్యక్రమాన్ని పార్టీ ప్రతినిధులు రూపకల్పన చేస్తున్నారు`` అని తెలిపారు. డిసెంబర్ 15వ తేదీలోగా పార్టీ మండల, పట్టణ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని ఈ సందర్భంగా పీఏసీ సభ్యులకు ప‌వ‌న్ సూచించారు. 

 

కాగా, ఉద‌యం సైతం ప‌వ‌న్ రాయ‌ల‌సీమ‌పై ప‌లు ఘాటు ట్వీట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా రాయలసీమలోనే ఉందని పేర్కొన్న ప‌వ‌న్‌..సీమలో దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారన్నారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది  మౌనంగా వినటమే తప్ప చేసేదేమి లేదన్నారు. పోరాట యాత్రలో తనతో యువత  వారి బాధలు చెబుతుంటే  గుండె కలిచి వేసిందన్నారు. 1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన  కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వస్తాయన్నారు పవన్. రాయలసీమ నుంచి ఇంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎందుకు వెనకబడిందనేది ఈ పుస్తకం చదివితే తెలుస్తుందన్నారు. సీఎం  జగన్ గురించి పుస్తకంలోని 75 పేజీలో జగన్ ప్రస్తావన ఉందంటూ‘ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: