ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై జనసేనాని పవన్ కళ్యాణ్  మరోసారి మండిపడ్డారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా నెలకొన్న సంక్షోభిత పరిస్థితులు, ఇసుక వారోత్సవాల గురించి సీఎం ప్రకటన చేసినా ఇప్పటికీ ఇసుక అందుబాటులోకి రాకపోవడం, అక్రమ తరలింపు వంటి అంశాలపై కమిటీ విస్త్రుతంగా చర్చించింది. విశాఖ లాంగ్ మార్చ్ అనంతర పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షించారు. జలవనరులను సంరక్షించుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన సుధీర్గంగా చర్చించారు. 

 

    తెలుగు మీడియం పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడంపై, 'మన నుడి, మన నది' కార్యక్రమ నిర్వహణపై లోతుగా చర్చించారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణంపై దిశానిర్దేశం చేసారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ స్పందించారు. పీఏసీ సమావేశంలో ప్రధానంగా ఆరు అంశాలపై చర్చించామని, ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇసుక విధానంపై చర్చించినట్టు తెలిపిరు. ఈ రోజుకీ అనేక చోట్ల ఇసుక సరఫరాలో అవకతవకలు జరగుతున్నాయని ప్రచారం జరగుతున్నా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.  

 

   ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడానికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదని, అయితే తెలుగు మాధ్యమాన్ని కచ్చితంగా కొనసాగించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మాధ్యమాలూ ఉండాలన్నారు. ఆంగ్ల భాషను విద్యార్ధులపై బలవంతంగా రుద్దడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామన్నారు. 95 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఒక తరానికి అన్యాయం చేసే విధంగా ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్క జన సైనికుడు ఇసుక రవాణా సరిగా జరుగుతుందా..? లేదా..?. సామాన్యుడికి ఇసుక చేరుతుందా..? లేదా..? అన్నదానిపై ఓ కన్నేసి ఉంచాలని సమావేశంలో నిర్ణయించారు. 

 

   ఒక్క విద్యార్థి అడిగినా తెలుగు బోధించాలన్న పవన్.. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పీఎసి సమావేశంలో నిర్ణయించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు భావి తరాలకు అందించాలంటే మాతృభాషను కాపాడుకోవడం చాలా అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై జనసేన పార్టీ తరపున స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మాధ్యమాలకు అవకాశం కల్పించాలని, తెలుగు మాధ్యమంలో చదవడానికి ఒక్క విద్యార్ధి సిద్ధంగా ఉన్నా సరే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ విద్యార్ధిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని పిఏసీ సమావేశం తీర్మానించింది. అలా కాకుండా ప్రభుత్వం మొండిగా ముందడుగు వేస్తే అన్ని పార్టీలను కలుపుకొని తెలుగు భాష పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని జనసేన ప్రభుత్వాన్ని హెచ్చరించింది. . 

 

 

      రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 49 నదులకు గత వైభవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమం రూపొందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన కార్యాచరణ రూపొందింస్తోంది. పార్టీ సంస్థగత నిర్మాణంపై దృష్టి సారించాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అందుకోసం నిర్దుష్ట మార్గదర్శకాలు ఇచ్చామని, డిసెంబర్ 15వ తేదీ కల్లా మండల, పట్టణ కమిటీలను పూర్తి చేసి ఆ ప్రతిపాదనలను పార్టీ కార్యాలయానికి పంపించాలని నియోజకవర్గ ఇంచార్జులను కోరామని మనోహర్ తెలిపారు. అలాగే త్వరలోనే పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తారని అన్నారు. విశాఖ లాంగ్ మార్చ్, డొక్కా సీతమ్మ గారి పేరుతో ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఆకలి తీర్చిన జనసైనికులు, నాయకులకు  పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారని నాదెండ్ల మనోహర్ తెలియజేసారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: