మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రానికి చేరుకున్నాయి. ఆ రాష్ట్ర సీఎంగా ఫ‌డ్న‌వీస్ శ‌నివారం ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. మ‌హా రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. బ‌ల‌నిరూప‌ణ కోసం బీజేపీ సిద్ద‌మైనా.. ఎన్సీపీ-శివ‌సేన కూట‌మి కూడా ఫ్లోర్ టెస్టుకు రెఢీ అంటోంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నాయకులు గవర్నర్‌ కోశ్యారీని రాజ్‌భవన్‌లో కలిశారు. తమకు 162 ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు లేఖ అందజేశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. ఎప్పుడుంటే ఎప్పుడు 162 ఎమ్మెల్యేల మద్దతు చూపిస్తామని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేశారు. 


288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 145. ప్ర‌స్తుతం మ‌హా కేసు సుప్రీంలో ఉన్న‌ది. మంగ‌ళ‌వారం బ‌ల‌ప‌రీక్ష విష‌య‌మై కోర్టు తీర్పు ఇవ్వ‌నున్న‌ది. అయితే ఈ లోపే పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌ను భ‌ద్ర‌ప‌రుచుకునే ప‌నిలో ప‌డ్డాయి. శివ‌సేన పార్టీ త‌మ ఎమ్మెల్యేల‌ను ప‌దిలంగా ఉంచుకునేందుకు హోట‌ళ్లు, రిసార్ట్‌ల‌ను బుక్ చేసుకున్న‌ది. ముంబైలోని లెమ‌న్ ట్రీ హోట‌ల్‌తో పాటు ఓ ప్రైవేటు రిసార్ట్‌ను శివ‌సేన ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. బ‌ల‌ప‌రీక్ష జ‌రిగే వ‌ర‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అక్క‌డే ఉండ‌నున్నారు.

 

విధాన భ‌వ‌న్‌లో 162 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేఖ‌ను ఇచ్చిన‌ట్లు శివ‌సేన శాస‌న‌స‌భాప‌క్ష నేత ఏక్‌నాథ్ షిండే తెలిపారు. అయితే చివ‌ర‌గా ఓ సారి అజిత్‌ను క‌న్విన్స్ చేస్తామ‌ని ఎన్సీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నికైన జ‌యంత్ పాటిల్ తెలిపారు. ఒక‌వేళ ఫ‌డ్న‌వీస్ మెజారిటీ నిరూపించ‌కోలేక‌పోతే, అప్పుడు అసెంబ్లీని ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని, అందుకే తాము ముందు త‌మ ఎమ్మెల్యేల జాబితాను విడుద‌ల చేశామ‌ని జ‌యంత్ పాటిల్ తెలిపారు. అదే లేఖ‌లో ఎన్సీపికి చెందిన 51 మంది ఎమ్మెల్యేలు సంత‌కం చేశారు. కాగా, మహారాష్ట్ర రాజకీయాలపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీల‌కంగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: