ఏపీలో అధికారంలో జగన్ ఉన్నారు. ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నారు. ఈ ఇద్దరు నేతలే అధికారాన్ని అటూ ఇటూ పంచుకుంటున్నారు. మిగిలిన పార్టీలది ఆటలో అరటిపండు పాత్రకే పరిమితం. జాతీయ పార్టీ అంటూ కొండంత  రాగం తీసినా ఏపీకి వచ్చేసరికి బీజేపీది నోటా కంటే ఓట్లు తక్కువ తెచ్చుకున్న పార్టీగానే ప్రజలు  చూస్తున్నారు. ఏదోలా ఒక్కసారి ఎదిగిపోదామని బీజేపీ చూస్తున్నా కూడా కాలం కలసిరావడంలేదు. అయితే బీజేపీ ఇపుడు రెండు ప్రధాన పార్టీలను విమర్శించడానికి మాత్రం మంచి అవకాశం వచ్చింది.

 

ఇక జగన్ మీద సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కేసులను విచారిస్తున్న  సంగతి విధితమే. ఈ నెల 22 నుంచి ఆ కేసు విచారణ  డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. ఇక నిన్న తొలిసారిగా ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసు మీద విచారణ జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని లక్ష్మీపార్వతి వేసిన కేసు స్టే ఎత్తివేత తరువాత తొలిసారిగా విచారణకు నోచుకుంది. ఈ కేసు మరో వాయిదా  డిసెంబర్ 6కి వాయిదా పడింది. మరి ఈ కేసు విచారణలో  ఏ రకమైన కీలక నిర్ణయాలు వస్తాయో, చంద్రబాబును కోర్టుకు రమ్మని పిలుస్తారో ఏమో  చూడాలి

 

ఇదిలా ఉండగా జగన్, చంద్రబాబుల మీద బీజేపీ నేతలు అపుడే విమర్శలు గట్టిగా చేస్తున్నారు. ఒకరు జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రి  అయితే నిన్నటి వరకూ ఏపీని పాలించిన  చంద్రబాబు జైలుకు వెళ్ళడానికి సిధ్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు పొలిటికల్ పంచులేశారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీల నేతలు అవినీతి వూబిలో కూరుకుపోయారని, అందువల్ల తాము కనుక అధికారంలోకి వస్తే నీతి వంతమైన పాలన అందిస్తామని ఆయన గట్టిగా చెబుతున్నారు.

 

ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నా జగన్ మీద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కేసు నడుస్తోంది. బాబు మీద ఇపుడు నడుస్తున్న కేసు కూడా అదే.  ఒకే రకమైన ఆరోపణలు ఉన్న రెండు కేసులూ ఒకే రోజున విచారణ జరగడం అంటే విశేషమేనని అంటున్నారు. ఇపుడు జగన్ని తమ్ముళ్ళు అనాల్సిన పనిలేదు అని కూడా సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి ఏపీలో పాగా వేద్దామనుకుంటున్న బీజేపీకి ఈ పరిణామాలు ఆనందం కలిగిస్తున్నాయని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: