గత రెండు రోజులు క్రితం హైదరాబాద్ లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద జరిగిన ఘోరం ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై  నవంబర్ 23 న మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి వంతెన పైనుంచి కింద పడిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో అక్కడ నిలుచొని ఉన్న సత్యవేణి (56) అనే మహిళపై కారు నేరుగా పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. 

ఈ ప్రమాదంలో కుబ్రా బేగం అనే యువతి తీవ్రంగా గాయపడింది. ప్రమాద సమయంలో యువతి ఫ్లైఓవర్ కింద ఉన్న చెట్టు కింద ఆటో ఎక్కేందుకు వేచిచూస్తోంది ఈ సమయంలోనే కారు అక్కడ ఉన్న చెట్టు మీద పడడంతో తీవ్ర గాయాలపాలు అయింది. ఆమె వెన్నెముక దెబ్బతినడంతో ఆపరేషన్ కు రూ 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. యువతి తండ్రి అజీమ్ ఒక పెయింటర్ తనది బీద కుటుంబం అవ్వడంతో అంత డబ్బు చెల్లించి వైద్యం చేయించే స్థోమత లేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న అనంత వెంకట్రామిరెడ్డి యువతికి సహాయం చేయాల్సిందిగా ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.

వెంటనే స్పందించిన సీఎం జగన్ ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి తక్షణ సాయం కింద రూ.3,60,000 మంజూరు చేశారు. అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ "ఈ వార్త గురించి తెలియగానే నా మనసు చలించింది. వెంటనే కుబ్రా బేగం చికిత్స పొందుతున్న కేర్ హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడ ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, డాక్టర్ ద్వారా ఆపరేషన్ ఖర్చుల వివరాలు తెలుసుకున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వివరాలు తెలిపాను. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కుబ్రా బేగం ఆపరేషన్ కోసం ఫండ్ విడుదల చేశారు" అని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బాధితురాలికి అండగా నిలిచినందుకు ఏపీ సీఎం జగన్ ను పలువురు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: