మహా భారతంలో కురు చక్రవర్తి దృతరాష్ట్రుడి భార్య గాంధారి దేవి కళ్ళకు గంతలు కట్టేసుకుందన్న విషయం అందరికీ తెలిసిందే. అది పురాణ కాలమైతే ప్రస్తుత కాలంలో ఎల్లోమీడియా కూడా అలాగే కళ్ళకు గంతలు కట్టేసుకుంది. రెండు రోజుల క్రితం దుబాయ్ లో జరిగిన రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ కొడుకు నిశ్చితార్ధం గురించి కనీసం ఒక్క ముక్క కూడా ఎక్కడా రాయలేదు.

 

ఒకపుడు గనుల ఘనుడు గాలి జనార్ధనరెడ్డి కూతురు వివాహం గురించి కొద్ది రోజుల పాటు ఎల్లోమీడియా ఎంతగా ఊదరగొట్టిందో అందరూ చూసిందే. వివాహ దినపత్రికను, ఆహ్వానితులను గాలి కుటుంబం ఆహ్వానించిన విధానాన్ని  టివి, పత్రికల్లో ఎల్లోమీడియా వైన వైనాలుగా ఎన్నిసార్లు చూపించిందో లెక్కేలేదు.

 

తన కూతురు వివాహానికి గాలి ఇంత ఖర్చు పెడుతున్నారని, ఇన్ని రకాల వంటలు చేయిస్తున్నారని, ఆహ్వానితులకు ఏఏ హోటళ్ళల్లో గదులు బుక్ చేశారో కూడా వివరంగా కథనాలు ప్రచురించింది. ఇదంతా ఎందుకంటే గాలికి ఎల్లోమీడియాకు ఏమాత్రం పడదంటే పడదు. అప్పటికే కేసుల్లో ఇరుక్కుని విచారణను ఎదుర్కొంటున్న గాలి కూతురు వివాహానికి పెట్టిన ఖర్చు ఎక్కడిదంటూ లా పాయింట్లు కూడా లేవదీశారు.

 

మరి ఇపుడు అంతకుమించి సిఎం రమేష్ ఖర్చు పెట్టారు. పైగా గాలి తన కూతురు వివాహం జరిపించింది కర్నాటకలోనే. సిఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్ధం జరిపించింది దుబాయ్ లో. రమేష్ పైన కూడా ఎన్నో ఆర్ధికపరమైన ఆరోపణలున్నాయి. సిబిఐ, ఐటి, ఈడి దాడులు జరిగాయి.

 

రమేష్ ఏమీ క్లీన్ చిట్ ఉన్న నేతైతే కాదు. మరలాంటపుడు దుబాయ్ లో జరిగిన కొడుకు రిత్విక్ నిశ్చితార్ధం గురించి ఎందుకు ఒక్క ముక్క కూడా రాయలేదు, చూపించలేదు. పైగా నిశ్చితార్ధానికి పిలిచిన ఆహ్వానితుల ప్రయాణం కోసం ఢిల్లీ నుండి ఏకంగా 17 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారట. మొత్తం మీద సుమారు రూ. 100 కోట్లు ఖర్చయినట్లు అంచనా. మరి ఇంత జరిగినా ఎల్లోమీడియా  ఒక్క ముక్క కూడా రాయలేదంటే రమేష్ ఇంట్లో ఫంక్షన్ ఉన్నట్లు తెలీదా ? లేకపోతే తమ వాడే కాబట్టి రాయలేదా ? మనలో మాట ఎల్లోమీడియా ప్రముఖులు కూడా దుబాయ్ కు వెళ్ళారని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: