ఇండియా, పాకిస్తాన్.. ఈ పేర్లు వినగానే చాలామందికి శత్రు భావమే గుర్తొస్తుంది. కానీ వ్యక్తులుగా అంతా మంచివారే.. మానవత్వానికీ, మమకారానికీ ఎవరూ అతీతులు కారు.. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసిందీ ఘటన.. ఇండియన్ క్యాబ్ డ్రైవర్ తో పాక్ క్రికెటర్లు ఆత్మీయంగా మెలిగిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

 

పాక్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైంది. ఆరోజు బ్రిస్బేన్‌ హోటల్‌ నుంచి ఐదుగురు పాక్‌ ఆటగాళ్లు ఓ క్యాబ్‌ను బుక్‌ చేసుకొని భారత రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ క్యాబ్ డ్రైవర్ ఓ ఇండియన్.. పాక్ క్రికెటర్లపై గౌరవంతో ఆ డ్రైవర్ డబ్బు తీసుకోలేదు. క్రికెటర్లు ఎంత బలవంత పెట్టినా ససేమిరా అన్నాడు.

 

డ్రైవర్ ఆప్యాయత, మర్యాద చూసి పాక్ క్రికెటర్లు తెగ ముచ్చటపడ్డారు. షాహిన్‌ షా, యాసిర్‌ షా, నసీమ్‌ షాలతో పాటు మరో ఇద్దరు ఆ డ్రైవర్‌ను తమ వెంట రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. డ్రైవర్ కు విందు ఇచ్చారు. ఇంతకీ ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో తెలుసా.. ఏబీసీ రేడియో వ్యాఖ్యాత అలిసన్‌ మిచెల్‌ ఈ విషయాన్ని ఆసీస్‌ మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌కు లైవ్‌లో చెప్పింది.

 

అలా ఆమె చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ విషయం ఆమెకు ఎలా తెలిసిందంటే.. స్వయంగా ఆ క్యాబ్‌ డ్రైవరే చెప్పాడట. ఆమె కూడా అదే క్యాబ్‌లో ఆసీస్‌ X పాక్‌ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా స్టేడియానికి వస్తుంటే డ్రైవర్‌ తన సంతోషాన్ని పంచుకున్నాడట. ఇలాంటి చిరు సంఘటనలే రెండు దేశాల మధ్య స్నేహ, సౌహార్థ్రతను పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: