తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యానికి సిద్ధ‌మ‌య్యారు. దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇందుకోసం ఒక‌టి కాదు..రెండు రోజుల పాటు కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ నెల 28న గురువారం మద్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో జరుగుతుంది. మరుసటి రోజు,శుక్రవారం కూడా సమావేశం కొనసాగే ఆస్కారం ఉందని ముఖ్య‌మంత్రి కార్యాల‌య వ‌ర్గాలు అన‌ధికారికంగా తెలిపాయి.

 

ఆర్టీసీ స‌మ్మె కీల‌క మ‌లుపులు తిరిగి...స‌మ్మె విర‌మిస్తున్న‌ట్లు ఆర్టీసీ జేఏసీ స్వ‌యంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సమ్మె విరమించడానికి సిద్ధమేనని గత బుధవారమే ప్రకటించిన .. పూర్తిస్థాయిలో సమ్మెను విరమిస్తున్నట్లు సోమవారం మరోసారి ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్‌ రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాజా నిర్ణయాన్ని ప్రకటించారు. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజల ఇబ్బందులను, కార్మికుల అవసరాలను గమనంలోకి తీసుకొని ఆర్టీసీలో జరుగుతున్న సమ్మెను విరమిస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులందరూ వెంటనే విధులకు హాజరుకావాల్సిందిగా జేఏసీ కోరుతున్నది’ అని అశ్వత్థామరెడ్డి చెప్పారు. సమ్మెకు ముందున్న పరిస్థితులను కల్పించి, ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, అనుకూల వాతావరణం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అయితే, ఆర్టీసీ యాజ‌మాన్యం మాత్రం నో చెప్పింది. చట్టవిరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు విధుల్లో చేర్చుకోవడం సాధ్యంకాదని ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ స్పష్టంచేశారు. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.

 

ఇలా ఆర్టీసీ కార్మికుల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌...ఇంచార్జీ ఎండీ కీల‌క కామెంట్ల నేప‌థ్యంలో..తెలంగాణ కేబినెట్ స‌మావేశంపై అంద‌రి దృష్టి ప‌డింది.  ఒక‌టి కాదు రెండు రోజుల పాటు కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ స‌మావేశంలో ఇతర అంశాలతో పాటు ఆర్టీసీ అంశంపైనే ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: