చంద్రబాబునాయుడు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. మూడుసార్లు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు దేశంలోనే సీనియర్ నేతగా  చెప్పుకుంటారు. తెలుగు గడప దాటని టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన చెప్పుకుంటారు.   ఇపుడున్న నేతలందరిలో తాను సూపర్ సీనియర్ అంటారు. అటువంటి చంద్రబాబుకు అవమానం అలా ఇలా జరగలేదు.

 

చంద్రబాబు జిల్లాల టూర్ల పేరు మీద మీటింగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా జగన్ సొంత జిల్లా కడపకు కూడా బాబు వచ్చారు. తాజా ఎన్నికల్లో కడపలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. పైగా నాయకులు కూడా జారుకుంటున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో చంద్రబాబు కడపకు వచ్చి టీడీపీ బలంగా ఉందని లోకానికి చాటి చెప్పాలనుకున్నారు. అయితే కడపలో బడా నాయకులంతా ముఖం చాటేసి బాబుకు అసలైన  షాక్ ఇచ్చారు.

 

ఇలా గైర్ హాజరు అయిన వారు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, శివనాధరెడ్డి కూడా ఉన్నారు. శివనాధరెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత తమ్ముడు. ఆది బీజేపీలోకి వెళ్ళిపోవడంతో ఆయన కూడా కమలం వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇక బీటెక్ రవి ఎందుకు రాలేదో తెలియదు కానీ ఆయన పార్టీ తీరు పట్ల అసంత్రుప్తిగా ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి.

 

మరో వైపు సీనియర్ నేత పాలకొండరాయుడు సైతం చంద్రబాబు మీటింగు వైపు తొంగి చూడలేదు. పొద్దుటూరుకి చెందిన ఈ నేత టీడీపీకి చాలా రోజులుగా  దూరంగా ఉంటున్నారు. ఇక ఈయన కుమారుడు సుగవాసి ప్రసాద్ వైసీపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు బద్వేలు టీడీపీ నేత విజయమ్మ కూడా పార్టీ మీటింగుకు రాకపోవడం విశేషం. ఈ మొత్తం పరిణామాలతో చంద్రబాబుకు కడప జిల్లాలో సైకిల్ పార్టీ అసలు రూపం ఎంటో స్వయంగా తెలిసివచ్చిందని అంటున్నారు.

 

ఇప్పటికే కడప నాయకులు చాలా మంది బీజేపీలోకి, వైసీపీలోకి వెళ్ళిపోయేందుకు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారుట. కడప జిల్లాలో వైసీపీ బలంగా ఉండడం, జగన్ సీఎం కావడంతో ఇక్కడ టీడీపీకి జెండా కట్టినా భయమేనన్న పరిస్థితి ఉందని అంటున్నారు. మరో వైపు చూసుకుంటే ప్రతీ ఎన్నికల్లోనూ కడపలో టీడీపీ ఓడిపోవడమే తప్ప గెలుపు ఆశలు లేకపోవ‌డంతో నేతలు సైతం వేరే దారి చూసుకుంటున్నారుట.

మరింత సమాచారం తెలుసుకోండి: