మ‌రికొన్ని క్ష‌ణాల ఉత్కంఠ‌....మ‌హారాష్ట్ర స‌ర్కారును తేల్చేయ‌నుంది. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయంపై సుప్రీంకోర్టు మ‌రికొద్ది  క్ష‌ణాల్లో తీర్పు వెలువ‌రించనుంది. మ‌హారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ బలనిరూపణపై సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌క‌టించ‌నుంది.సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్, శివసేన కోరుకుంటున్నాయి. మరోవైపు, నవంబర్ 30 వరకు విధించిన గడువు అలాగే ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ నేప‌థ్యంలో... శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌ను ఆదేశించనుందా?  ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్‌పవార్ డిప్యూటీ సీఎంగా కొన‌సాగించే క్ర‌మంలో బ‌ల‌నిరూప‌ణ‌కు నియ‌మిత గ‌డువు విధించ‌నుందా అనే ఉత్కంఠ దేశ‌వ్యాప్తంగా నెల‌కొంది. 

 

ప్రభుత్వ ఏర్పాటు కోసం తనకు మద్దతునిస్తున్న ఆయా పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను శివసేన బహిరంగంగా హాజరుపరిచింది. ముంబై గ్రాండ్ హయాత్ హోటల్‌లోని సమావేశ మందిరాన్ని తన బలప్రదర్శనకు వేదికగా మలచుకుంది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ -సమాజ్‌వాదీ-ఇండిపెండెంట్ల ఐక్యత వర్ధిల్లాలి అన్న నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు హయాత్ హోటల్‌లోని గ్రాండ్ హాల్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరూ నిల్చొని శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి విధేయులుగా ఉంటామని, బీజేపీ ప్రలోభాలకు లొంగబోమని ప్రతిజ్ఞ చేశారు.ఈ బలప్రదర్శన ద్వారా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం తమకుందన్న సందేశాన్ని ఇటు ప్రజలకు, అటు రాజ్‌భవన్ కు పంపింది. మూడు పార్టీల బలప్రదర్శనను బీజేపీ ఎద్దేవా చేసింది. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేసింది.

 


దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు వెలువ‌రించే ముందు రోజు హాట్ హాట్ వాద‌న‌లు సాగాయి. జస్టిస్‌లు ఎన్వీ రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ముందు రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడం, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్‌పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం, బలపరీక్షకు రెండు వారాల గడువు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర వికాస కూటమి దాఖలు చేసిన పిటిషన్‌ వాదనల స‌మ‌యంలో...ఆయా ప‌క్షాలు బ‌లంగా త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్, బీజేపీ, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, కేంద్రం, గవర్నర్ కార్యదర్శి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కూటమి తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు. కాసేప‌ట్లో..ఈ వాదన‌ల‌పై తీర్పు వెలువ‌డ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: