ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా, విధుల్లో చేర్చుకునేది లేదని  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెబుతున్నప్పటికీ , కేంద్రం కట్టడి ఆయన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి . ఆర్టీసీ సమ్మె గురించి మరొకవైపు కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు డా. లక్ష్మణ్ చెబుతూనే ఉన్నారు . ఇక అఖిలపక్షం వెళ్లి కూడా గవర్నర్ తమిళిసై ని కలిసి , సమ్మె విరమించిన వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు . అయినా కూడా కేసీఆర్ మొండికేయడానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి .

 

 ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోకి  మోడీ సర్కార్ ప్రయివేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తుండగా , ఎయిర్ ఇండియా ను ఏకంగా వదిలించుకోవాలని చూస్తున్న ప్రస్తుత తరుణం లో కేంద్ర అడుగుజాడల్లోనే నడుస్తున్న కేసీఆర్ ను కేంద్రం ప్రశ్నించే సాహసం చేయడం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . అందుకే కేసీఆర్ , ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా,  విధుల్లోకి తీసుకోబోమంటూ ఖరాఖండిగా తేల్చిచెబుతున్నారని అంటున్నారు . ఇక రాష్ట్రం లో విపక్షాలు , ప్రజాసంఘాలు ఆర్టీసీ కార్మికులతో కలిసి సమ్మె ప్రభావాన్ని ప్రజాబాహుళ్యం లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం లో విఫలమయ్యారన్న విమర్శలు లేకపోలేదు . రాష్ట్ర ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి , కేసీఆర్ ను దారిలోకి తెచ్చుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించలేకపోయారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు .

 

ఇక ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె ప్రారంభించే ముందు ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలను కలిసి వారి మద్దతు కోరి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . ఇక కేసీఆర్ , సమ్మె పట్ల మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తాను అనుకున్నట్లుగా ఆర్టీసీ లోకి ప్రయివేట్ బస్సులను ఆహ్వానించడం లో , రూట్ల ప్రయివేటీకరణ లో సక్సెస్ అయ్యారని అంటున్నారు . అయితే కార్మికులు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోబోమని మొండిపట్టుదలకు పొతే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: